హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్తూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్య వ్యవస్థలను కించపరచడం, అగౌరవపరచడంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణేని కి ఉన్న రెండు ముఖాలని విమర్శించారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేండ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాం గ శూన్యత అని పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆక్షేపించారు. ఆయన చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం గు రించి గొంతు చించుకునే కేసీ వేణుగోపా ల్, రాహుల్ తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెప్తారు? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీ లో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రిపీట్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయని మంగళవారం ప్రకటనలో దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.