‘హస్త’వ్యస్త పాలనలో తెలంగాణ ఆగమాగం అవుతున్నది. దారీతెన్నూ లేని విధానాలతో అన్ని రంగాలూ నేలచూపులు చూస్తున్నాయి. స్వరాష్ట్ర సాధన తర్వాత దాదాపు పదేండ్ల కాలంపాటు ఓ వెలుగువెలిగిన రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఇపుడు దయనీయంగా తయారైంది. మరీ ముఖ్యంగా ‘రియల్’ రంగంలో రారాజులా వెలిగిన రాజధాని హైదరాబాద్ పరిస్థితి కళావిహీనమైంది. కేవలం రెండున్నరేండ్ల వ్యవధిలోనే దృశ్యం తారుమారైంది. గత వైభవమంతా మూసీలో కలిసిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంపై ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ నివేదిక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి జరిగిన డ్యామేజీని ఎత్తిచూపింది. కేవలం రెండున్నరేండ్ల వ్యవధిలోనే గత వైభవమంతా గంగలో కలిసిన వైనం ఆ నివేదిక బయటపెట్టింది. కేసీఆర్ హయాంలో దేశంలోనే అత్యధిక అమ్మకాలతో టాప్-3లో స్థానం దక్కించుకున్న హైదరాబాద్.. ఇపుడు కాంగ్రెస్ విధ్వంసక పాలనలో దివాలా తీసింది. బెంగళూర్, ముంబై, పుణె, ఢిల్లీ నగరాల తర్వాత స్థానాల్లో ఇండోర్ లక్నో, కోయంబత్తూర్ ఉన్నాయి. చివరకు ఇంకా రూపమే దిద్దుకోని అమరావతి కూడా పోటీలో ఉండగా, హైదరాబాద్ అడ్రస్ గల్లంతైంది.
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఎదిగిన రియల్ ఎస్టేట్ రంగం గత రెండున్నరేండ్లుగా గణనీయమైన మాంద్యంలో పడిపోయింది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించిన ఈ రంగం, ప్రస్తుతం ప్రభుత్వ విధానాల అస్పష్టత, పరిపాలనా లోపాలు, జాతీయ-అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో నానాటికీ దిగజారుతున్నదనే అభిప్రాయం బలపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు ఈ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా ‘హైడ్రా’ వంటి కార్యక్రమాలు అడ్డగోలుగా అమలు చేస్తుండటం వల్ల పెట్టుబడిదారుల్లో అపనమ్మకం పెరిగింది. రియల్ రంగంలో పెట్టుబడి అంటేనే దడుపు కలుతున్నది. ఇక ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) సమస్య మరో ప్రధాన అడ్డంకిగా మారింది. భూముల స్వాధీనం, పరిహారం అంశాల్లో టీడీఆర్ విధానం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల డెవలపర్లు, భూమి యజమానులకు అనిశ్చితి ఏర్పడింది.
ఇచ్చిన హామీలు అమల్లోకి రాకపోవడం, మార్కెట్లో టీడీఆర్ విలువ తగ్గిపోవడం రియల్ రంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అదే సమయంలో నిర్మాణ అనుమతుల ప్రక్రి య కూడా క్లిష్టతరం కావడం మరోదెబ్బ. అనుమతుల్లో ఆలస్యం, పారదర్శకత లోపించడం, అనేక విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొత్త ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో కేసీఆర్ హయాంలో ముందంజలో ఉన్న హైదరాబాద్, ఇప్పుడు బ్యూరోక్రాటిక్ అడ్డంకులతో వెనుకబడుతుండటం బాధాకరం. గ్లోబల్ ఆర్థిక మాంద్యం, వడ్డీరేట్ల పెరుగుదల, ఐటీ రంగంలో నియామకాల మందగమనం వంటి అంశాలూ డిమాండ్‌ను కొంతమేర తగ్గించాయి.
విదేశీ పెట్టుబడులు తగ్గడం వల్ల కూడా మార్కెట్ తన మెరుపును కోల్పోయింది. కేసీఆర్ హయాంలో నగరంపై ఒత్తిడి తగ్గించి, విస్తరణకు వీలు కల్పించేందుకు అమలు చేసిన ‘గ్రోత్ సెంటర్స్’ అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతుండటం రియల్ పతనానికి మరో కారణం. రైతులను కష్టకాలంలో భూమి ఆదుకుంటుందన్న భరోసా లేకుండా పోయింది. ఈ పరిస్థితు ల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన, స్థిరమైన రియల్ ఎస్టేట్ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నది. కొనుగోలుదారుల్లో నమ్మకం పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. అనుమతులు సులభతరం, టీడీఆర్ సమస్యల పరిష్కారం, గ్రోత్ సెంటర్ల పునరుద్ధరణ వంటి చర్య లు తీసుకుంటేనే ఈ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నది. లేకపోతే, ఒకప్పుడు వేగంగా ఎదిగిన రియల్ ఎస్టేట్ రంగం దీర్ఘకాలిక మాం ద్యంలో చిక్కుకొనే ప్రమాదం ఉన్నది.