– బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు
కట్టంగూర్, జనవరి 09 : సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులు సాఫీగా వెళ్లేందుకు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు కట్టంగూర్ మండల పరిధిలో రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు. మండల పరిధిలో ఉన్న15 కిలోమీటర్ల హైవేపై గల యూటర్న్ల వద్ద రేడియం స్టిక్కర్లు, బారీకేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
జాతీయ రహదారిపై చెర్వుఅన్నారం స్టేజీ, అయిటిపాయులలోని వంతెన, కట్టంగూర్లోని నల్లగొండ క్రాస్ రోడ్డు, ముత్యాలమ్మగూడెం, పామనుగుండ్ల గ్రామాల్లో ఉన్న బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేకంగా పోలీస్ పికెట్తో పాటు రేడియం స్టిక్కర్లు, బారీకేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగి వాహనాలు రహదారిపై నిలిచిపోతే వెంటనే వాటిని పక్కకు జరిపి ట్రాఫిక్ ను పునరుద్దరించేందుకు క్రేన్ ను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుని తిరిగి సురక్షితంగా హైదరాబాద్కు చేరే వరకు రహదారిపై పెట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరుగుతాయని పేర్కొన్నారు.