వికారాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : గత కేసీఆర్ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయించినందుకు వెచ్చించిన డబ్బులను ఇంకా విడుదల చేయడం లేదు. తమ పెం డింగ్ బకాయిలను చెల్లించాలని వారు గత రెండేండ్లుగా ప్రతి సోమవారం ప్రజావాణిలో వినతిపత్రాలు అందిస్తున్నా బిల్లులకు మాత్రం మోక్షం లభించడం లేదు. కేవలం కొడంగల్ నియోజకవర్గంలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పూర్తి పూర్తైన పనులకుగాను కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్నది.
ఏడాది కిందట కొడంగల్ నియోజకవర్గంలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పనులను పూర్తి చేయించిన కాంట్రాక్టర్లకు బిల్లులను విడుదల చేసిన ప్రభుత్వం.. వారికే అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల కాంట్రాక్ట్నూ అప్పగించడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పనులు చేయించిన కాంట్రాక్టర్లు.. సతుల పుస్తెలతాళ్లు అమ్మి ప్రభుత్వ స్కూళ్లలో పనులు చేయించామని కొందరు, తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని మరికొందరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా పూర్తైన పనులకు పూర్తి బిల్లులను చెల్లించిన ప్రభుత్వం.. గత ప్రభు త్వంలో జరిగిన పనుల బిల్లులను ఆపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెండింగ్లోనే రూ.8 కోట్ల బిల్లులు..
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తైనా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు గత 26 నెలలుగా వాటికోసం ఎదురుచూస్తున్నారు. స్కూల్ కమిటీలు, సంబంధిత అధికారుల ఒత్తిడితో పలు బడుల్లో పనులను పూర్తి చేయించిన చిన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, పనులు పూర్తి చేయించిన వారిలో చాలా వరకు స్కూల్ కమిటీ సభ్యులే ఉండ డం, వారు అప్పులు చేసి పనులు పూర్తి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఈవో, కలెక్టర్, ప్రజాభవన్, సచివాలయంలోని సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం నిధుల విడుదలలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది.
‘మన ఊరు-మన బడి’లో పూర్తైన పనులకు సంబంధించి బిల్లులకు ఎంబీలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ బిల్లుల విషయంలో త్వరలో వస్తాయని చెబుతున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసేందుకు సొంత డబ్బు ఖర్చు పెట్టి పనులను చేయిస్తే నిధుల విడుదలలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో మొదటి విడతలో 371 స్కూళ్లను ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ఎంపిక చేయగా 20 స్కూళ్లలో పనులు పూర్తికాగా వాటిని గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. అయితే సుమారు 300 బడుల్లోపనులు 50-80 శాతం మేర పనులు పూర్తి కాగా.. వాటికోసం రూ.8 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయి.