వైర్ కావాలన్నా.. ఏబీ స్విచ్‌లు కావాలన్నా.. ఇంకేదైనా మెటీరియల్ కావాలన్నా.. స్టోర్స్‌కు వెళ్తే లేదనే సమాధానమే వస్తుంది. కానీ అదే సామగ్రి కొందరు అధికారులకు అనుకూలమైన, బినామీలుగా ఉన్న కాంట్రాక్టర్ల దగ్గర లభ్యమవుతున్నది. ఇది ప్రస్తుతం దక్షిణ డిస్కంలో గప్‌చుప్‌గా జరుగుతున్న దందా. విద్యుత్ స్టోర్లలో మెటీరియల్ పక్కదారి పడుతోంది. కాగా, గతంలో స్టోర్స్‌లో సామగ్రి కావాల్సినంత లభ్యమయ్యేది. గత రెండేళ్లుగా సామగ్రి కొరతతో పనులు ముందుకుసాగక, జరిగే పనుల్లోనూ పూర్తి సామగ్రి దొరకక కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)
గతంలో స్టోర్స్‌లో సామగ్రి కావాల్సినంత లభ్యమయ్యేది. కానీ రెండేళ్లుగా సామగ్రి కొరతతో పనులు ముందుకుసాగడం లేదు. జరిగే పనుల్లోనూ పూర్తి సామగ్రి దొరకక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే టర్న్‌కీ కాంట్రాక్టర్లు కొందరు తాము చేసే పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లలోనే ఎక్కువ సామగ్రి వేసి వాటిని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శివారు ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. కొందరు డివిజనల్ స్థాయి అధికారులతో కలిసి స్టోర్లకు సంబంధించిన అధికారులు కూడా కుమ్మక్కై కాంట్రాక్టర్లకు కావలసిన సామగ్రి ఇవ్వడం, వారు చేసిన పనుల్లో అదనంగా చేర్చిన సామగ్రిని నేరుగా తమ ఇంట్లో కానీ, గోడౌన్లో కానీ డంప్ చేసి అక్కడినుంచే అమ్మకాలు చేస్తున్నట్లు మింట్ కాంపౌండ్‌లో చర్చించుకుంటున్నారు.
వాస్తవానికి స్టోర్ల నుంచి సబ్డివిజన్లకు వచ్చిన మెటీరియల్‌ను సెక్షన్ల వారీగా విభజించి సెక్షన్ ఇంజినీర్‌కు అప్పగించాలి. కానీ ఇందుకు భిన్నంగా కొన్ని డివిజన్లలో ఎంత మెటీరియల్ వస్తున్నదనేది కొందరు అధికారులకు మాత్రమే తెలుస్తున్నది. తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకు సామ గ్రి ఇచ్చి వారి వద్దే ఉంచడం శివారు ప్రాంతాల్లో సాధారణమైంది. స్టోర్ల నుంచి సామగ్రి తీసుకోవడం వాటిని తమ వద్దే పెట్టుకుంటూ ఒకవేళ లైన్మెన్లకు, ఆర్టిజన్లకు అవసరమైతే తమ వద్దకే వచ్చి తీసుకోవాలంటూ ఆ కాంట్రాక్టర్లు హూకుం జారీ చేస్తున్నారంటూ కొందరు లైన్మెన్లు చెప్పారు.
తమ సంస్థ అధికారుల వద్ద ఉండాల్సిన మెటీరియల్ కూడా కాంట్రాక్టర్ల దగ్గరే ఉండడంతో తమకేం చేయాలో తెలియడం లేదని, ఒకవేళ తమకు ఏదైనా వస్తువు అవసరమైతే తమ ఏఈకి చెప్పి లేదా సబ్ఇంజినీర్కు చెప్పి తెప్పించుకుంటున్నామని, అది కూడా ఆ కాంట్రాక్టర్లు తమ మనుషులతో పంపిస్తారు తప్ప.. తమను ఆ ప్రాంతానికి కూడా రానివ్వరంటూ వారు పేర్కొన్నారు. ఇటీవల మేడ్చల్ జోన్‌లోని ఒక సబ్‌డివిజన్‌కు జనవరి నుంచి జూన్ వరకు కోట్ల రూపాయల విలువైన విద్యుత్ సామగ్రి విడుదలైంది.
ఇందులో మూడు సెక్షన్లకు సంబంధించి 40 కిలోమీటర్ల 55 స్కేర్ ఎంఎం కండక్టర్ స్టోర్స్ నుంచి బయటకు వచ్చింది. దాదాపు 20 కిలోమీటర్లకు సరిపడా ఎల్టీ ఏబీ కేబుల్‌ను కూడా స్టోర్ నుంచి డ్రా చేశారు. దీంతో ఎల్టీ, 11కేవీ సామగ్రి అంతరాయాల నివారణ కోసం ఇచ్చారు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా తన దగ్గర ఉన్న సామాగ్రి అధిక ధరకు అమ్ముకోవడం, వచ్చిన డబ్బులను తనకు సంబంధించిన అధికారులకు పంచి ఒకవేళ పైస్థాయి నుంచి ఎవరైనా ఒత్తిడి చేస్తే వారికి కొంత ముట్టజెప్తున్నట్లు ఆ సబ్‌డివిజన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాము చేసే పనులకు కావాల్సిన సామగ్రి ఎంతమేరకు అవసరమో అంతే తీసుకోవడం లేదా ఒకట్రెండు ఎక్కువ తక్కువలతో ఎస్టిమేషన్లు వేయాలి కానీ శివారు ప్రాంతాల్లోని కొందరు కాంట్రాక్టర్లు ఒక పని చేయడానికి అవసరమైన మెటీరియల్ కంటే ఎక్కువగా తీసుకుంటున్నట్లుగా తెలిసింది. అందులో ఎంతమేరకు సామగ్రి అవసరం పడుతుందో, మిగతా సామగ్రి ఏంచేస్తున్నారనే నిఘా లేని పరిస్థితి మాత్రం ఎస్పీడీసీఎల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.
సీఎండీ జితేష్ వీ పాటిల్ వచ్చిన కొత్తలో మెటీరియల్ పక్కదారి పడుతున్నట్లుగా గుర్తించారు. దీనిపై ఖచ్చితంగా నిఘా పెట్టాలంటూ అధికారులను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా చోట్ల అప్పటికే ఎస్టిమేషన్లు, సామగ్రి రిలీజ్లు అయిపోయాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్, మా న్సూన్ పనులకు సంబంధించి సదరు కాంట్రాక్టర్లు అధికారులతో కలిసి చేసిన దందాలో కొన్ని కోట్ల రూపాయలు సంస్థకు నష్టం జరిగినట్లు కార్పొరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదంటూవిమర్శలు వెల్లువెత్తుతున్నా యి.
స్టోర్లలో సామగ్రి లేక చాలామంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతుంటే కొందరు మాత్రం తమకు అనుకూలమైన అధికారులతో కుమ్మక్కై కావాల్సిన సామగ్రి తెచ్చుకుంటూ ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మూడునెలల కిందట కాంట్రాక్టర్లు సీఎండీని కలిసినప్పుడు కూడా కొందరు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని, క్షేత్రస్థాయిలో శివారు ప్రాంతాల్లో మాత్రం ఈ దందా జరుగుతున్నదని ఒక సీనియర్ ఇంజినీర్ చెప్పారు.