సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేలమంది కార్మికులు మంగళవారం చలో సెక్రటేరియట్లో భాగంగా ధర్నా చౌక్‌కు తరలి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు మందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రెండు పీఆర్సీలు వెంటనే మంజూరు చేయాలని గళమెత్తారు. ప్రభుత్వ విలీన ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. హక్కులు అడిగితే కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి దిగిపో అంటూ నినదించారు. కార్మికవర్గం ఏకతాటిపైకి వచ్చిందని గొంతెత్తారు. తమను పట్టించుకోకపోతే సమ్మె చేసి తమ సత్తా చాటుతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
సిటీబ్యూరో/కవాడిగూడ, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ధర్నాచౌక్‌కు అధిక సంఖ్యలో కార్మికులు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, వాహనాలు సమకూర్చుకుని ముందుగానే సిద్ధమయ్యారు. కట్టమైసమ్మ ప్రాంతం, తెలుగు తల్లి ఫైఓవర్ నుంచి సెక్రటేరియెట్ వరకు భారీగా పోలీసులు మోహరించారు. చలో సెక్రటేరియట్‌కు కార్మికులు తరలితే పరిస్థితి చెయ్యి దాటే ప్రమాదం ఉందని పోలీసులు సూచించడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు చివరి దశలో జేఏసీ నాయకులతో ఫోన్లో మంతనాలు జరిపి ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో తమ డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి హామీ మేరకు చలో సెక్రటేరియెట్ ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళుతామని జేఏసీ హెచ్చరించింది. కాగా, మహిళా కండక్టర్లు మోకాళ్లపై భిక్షాటన చేస్తూ తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆడుతూ సర్కార్ వైఫల్యాన్ని ఎండగట్టారు.
సర్కార్‌పై కార్మికుల కన్నెర్ర..
ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కన్వీనర్ ఎండీ మౌలానా మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికులపై యాజమాన్యం వేధింపులు ఎక్కువయ్యాయని, పనిభారాన్ని పెంచి కార్మికుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలన్నింటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని, అన్ని కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయాలన్నారు. జేఏసీ కోకన్వీనర్ యాదయ్య మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగి చనిపోతే బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద ఆ కుటుంబంలో అర్హులైన ఒకరికి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తారని, ప్రభుత్వంలోను, సింగరేణికాలరీస్ లోనూ ఇలాంటి నియామకాలే జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగం రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా కన్సాలిడేటెడ్ బేసిస్‌లో కారుణ్య నియామకాలు చేపట్టడం దురదృష్టకరమన్నారు. కో కన్వీనర్ సురేశ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేశారని అన్నారు.
ఈ పథకంలో డ్రైవర్, కండక్టర్లపై దాడులు జరుగుతున్నా, కైంప్ల్లెంట్స్ చేస్తున్నా వారు అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో అక్రమాలు జరిగాయని కార్మికులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. మహిళా ప్రయాణికులకు ఈ పథకంలో భాగంగా టికెట్లెస్ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కో కన్వీనర్ యాదగిరి మాట్లాడుతూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల సంక్య రోజురోజుకి పెరిగిపోతుందని దీంతో చాపకింద నీరులా సంస్థ ప్రైవేటీకరణకు దారితీస్తుందన్నారు. వందలాది మంది కార్మికులు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు థామస్ రెడ్డి, వెంకన్న, గోప శ్రీనివాస్, కృష్ణ, రమేశ్, రఘు, రాంచందర్, భాగ్యలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

విలీన ప్రక్రియను పూర్తి చేయాలి: సుజాత, కండక్టర్
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. రెండేండ్లు గడుస్తున్నా సర్కార్ పట్టించుకోకపోవడం దారుణం. విలీన ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
ఆర్టీసీని ప్రైవేట్‌కు అప్పగించొద్దు: శ్రీరాములు, డ్రైవర్
పనిభారం పెరిగింది. రోజంతా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అంత కష్టపడినా మాకు వచ్చే బెన్ఫిట్స్ కూడా రావడం లేదు. ఈవీ బస్సుల పేరుతో తమ ఉద్యోగాలపై వేటు వేయాలని సర్కార్ చూస్తున్నది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలు రద్దు చేసుకోవాలి.
తప్పని బస్సు కష్టాలు..
ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియెట్ నిరసన కారణంగా నగరంలో చాలా బస్సుల రాకపోకలు తగ్గాయి. నగరవాసులకు ప్రయాణ కష్టాలు తప్పలేదు. గ్రేటర్‌లోని 25 డిపోల నుంచి వందలాది మంది కార్మికులు తరలిరావడంతో అధిక సంఖ్యలో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ తలపించింది. విద్యార్థులు, ఉద్యోగులు గమ్య స్థానాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ఆటోలను ఆశ్రయించగా.. మరికొందరు యాప్ ఆధారిత సేవలపై ఆధారపడాల్సి వచ్చింది.