Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయింది. 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 78,263.33 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ, ఆ తర్వాత నష్టాల్లో సాగి, నష్టాల్లోనే ముగిసింది. అత్యధికంగా 78,263.33 పాయింట్లను చేరుకోగా, అత్యల్పంగా 77,497.93 పాయింట్లకు పడిపోయింది. ఒకే రోజు 765.51 పాయింట్ల నష్టాన్ని కనబర్చింది. చివరకు 187.90 పాయింట్లు (0.24 శాతం) నష్టంతో 77,966.35 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే సాగింది. నిఫ్టీ 35.75 పాయింట్లు (0.15 శాతం) నష్టంతో 24,435.95 వద్ద ముగిసింది.
అయితే, బ్రాడర్ మార్కెట్ మిశ్రమ ఫలితాలతో ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 31.16 పాయింట్లు (0.17 శాతం) లాభపడగా, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.39 శాతం లాభపడింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలు, క్రూడాయిల్ ధర పెరగడంతోపాటు టాటా గ్రూప్ స్టాక్స్ భారీ అమ్మకాలకు పాల్పడటంతో మార్కెట్ నష్టాల బాటలో సాగింది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ రాజీనామా అంశం మార్కెట్‌పై దుష్ప్రభావం చూపింది. దీంతో టీసీఎస్ షేర్లు 4 శాతానికిపైగా నష్టపోయాయి. బీఎస్ఈ 30 షేర్ ఇండెక్స్‌లో ఎస్బీఐ, అల్ట్రా సిమెంట్, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల షేర్లు లాభాల్లో సాగాయి. ఏసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్‌టెక్, అదానీ పోర్ట్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 89 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బంగారం ఔన్స్ ధర రూ.4,417.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయితో డాలర్ మారకం విలువ 95.33గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లకు సంబంధించి ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాల్లోనే కొనసాగాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఏకంగా 4.59 శాతం పెరిగింది. జపాన్ నిక్కీ 225 పాయింట్లు పెరిగింది. షాంగై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ కూడా లాభాల్లోనే ముగిసింది. హాంకాంగ్‌కు చెందిన సెంగ్ ఇండెక్స్ మాత్రం నష్టాల్లో ముగిసింది. అమెరికా మార్కెట్లు కూడా బుధవారం నష్టాల్లోనే ముగిశాయి.