సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): నగర శివారులో కొందరు డిస్కం అధికారులది కనెక్షన్ల విషయంలో ఆడిందే ఆట..పాడిందే పాటగా వ్యవహారం కొనసాగుతోంది. తమ బినామీలతో పనులు చేయిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన వారి తీరు మాత్రం మారడం లేదు. పైన చెప్పిన వ్యవహారంలో సైబర్‌సిటీ సర్కిల్ పరిధిలోని కొండాపూర్ సబ్‌డివిజన్‌లో డిస్కం సిబ్బంది ముడుపుల బాగోతాన్ని కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. కాంట్రాక్టర్ల ద్వారా వెళితే వారికి ఫైల్ ముందుకు పోనీయకుండా వారు అడిగినంత ఇచ్చినవారికే కనెక్షన్లు ఇస్తూ వ్యవహారం చేస్తున్న కొండాపూర్ సిబ్బంది ఈ విషయంలో కూడా అదే తీరును ప్రదర్శించారు.
వినియోగదారుడు కా్రట్రాక్టర్ ద్వారా 25కేవీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 63 రోజులు పెండింగ్ పెట్టి చివరకు ఏదో ఒక సాకు చూపించాలనే లక్ష్యంతో దరఖాస్తుదారుడు తన డాక్యుమెంట్ల హార్డ్‌కాపీలు సమర్పించలేదని అందుకే రిజెక్ట్ చేస్తున్నామంటూ ఆన్లైన్లో అప్లికేషన్‌ను తిరస్కరించారు. రెండురోజుల తర్వాత తమ బినామీలైన కిందిస్థాయి సిబ్బందితో కలిసి మరోసారి దరఖాస్తుదారుడితో ఈనెల 20న ఐప్లె చేయించి కొన్ని కండీషన్లు పెట్టి డబ్బులు కట్టించుకున్నారు. ఇక్కడ వినియోగదారుడికి జరిగిన నష్టం సమయంతో పాటు లక్షల రూపాయల ముడుపులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి రావడం. అంతేకాకుండా తన కనెక్షన్ కోసం ఆ సిబ్బంది చుట్టూ తిరుగుతూ వారు చెప్పిందే చేయాల్సి ఉంటుంది తప్ప నిబంధనలను పాటిస్తే మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదముంటుందని స్థానిక విద్యుత్ సిబ్బంది నుంచి బెదిరింపులు కూడా ఉన్నాయట.
ప్రతి పనికో రేటు..
విద్యుత్ శాఖలో చేయి తడపనిదే పని జరగడం లేదు. క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్‌పే వంటి డిజిటల్ యాప్‌తో పాటు పలు రూపాల్లో లంచాలు తీసుకున్న ఎనిమిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసిన దక్షిణ డిస్కంవి కంటి తుడుపు చర్యలేననే విమర్శలు వస్తున్నాయి. కొంతకాలంగా అధికారులు చేస్తున్న అరాచకాలు, వినియోగదారులు, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సాక్ష్యాధారాలతో సహా సీఎండీ ముషారఫ్‌కు ఫిర్యాదు చేసినా కనీసం స్పందన లేదంటూ మింట్‌కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది. ప్రతిలైన్మెన్ పరిధిలో ఒకరు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని లైన్మెన్లు వీరి ద్వారా పనులు చేయిస్తూ డబ్బులు వసూలుచేస్తున్నట్లు ఆరోపణలుఉన్నాయి.
కనెక్షన్, మీట్ల మంజూరు, ఫ్యూజ్ఆఫ్కాల్ పనులకు సైతం రూ.500 నుంచి రూ.6వేల వరకు డబ్బులు తీసుకుని పనులు చక్కదిద్దుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇక ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీఎంల విషయానికొస్తే లక్షల్లోనే ముడుపులు ముట్టజెప్పాలని, ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్ చేశారని ఒక విద్యుత్ అధికారి చెప్పారు. సైబర్‌సిటీ వంటి ప్రాంతాల్లో కేవీలను బట్టి రేట్లు ఉన్నాయని, 25 కేవీకి రూ. 2లక్షల నుంచి 5లక్షలు, 63 కేవీకి రూ. 5లక్షల నుంచి పది లక్షలు, 100కేవీకి పదినుంచి రూ. 15లక్షలు, ఆ పైన రూ. 30లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంకా కేవీ పెరిగిందంటే కోటి రూపాయల వరకు ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని డిస్కం ప్రధాన కార్యాలయంలోనే చర్చ జరుగుతోంది.
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..
సైబర్‌సిటీ సర్కిల్ పరిధిలో విద్యుత్ సిబ్బంది వ్యక్తిగతంగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని వీరంతా స్థానిక అధికారికి బినామీలంటూ కొందరు కాంట్రాక్టర్లు ఎస్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేశారు. విజయ్ అనే లైన్‌మెన్‌తో సహా సాయిరామ్, నరేశ్, మురళి, మహిపాల్‌రెడ్డి, మురళి, అమిద్హుస్సేన్, నగేశ్, మల్లేశ్ అనే ఆర్జిజన్లు మొత్తం తమ పరిధిలో జరిగే పనులను కాంట్రాక్టర్లకు దక్కకుండా ఏదో ఒక సాకు చూపించి తాము బినామీలతో చేయిస్తున్నారని, వీరందరికీ సబ్‌డివిజన్ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇబ్రహీంబాగ్, కొండాపూర్ వంటి చోట్ల కేబుల్ పనుల్లో కూడా చాలా అవకతవకలకు పాల్పడ్డారని వీరిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం లేకపోయిందని కాంట్రాక్టర్లు చెప్పారు. ఇదిలా ఉంటే స్థానిక ఉన్నతాధికారి తన అదనపు ఆదాయంతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, ప్రతి పనికి డబ్బులు ఇవ్వనిదే ఫైళ్లు ముట్టరని మింట్‌కాంపౌండ్‌లో చర్చించుకుంటున్నారు.
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న ఆన్లైన్ రశీదు ఎస్పీడీసీఎల్ కొండాపూర్ సబ్‌డివిజన్ పరిధిలో ఒక నిర్మాణానికి కావలసిన కనెక్షన్‌కు సంబంధించినది. డిసెంబర్ 12న ఈ దరఖాస్తును తిరస్కరిస్తున్నామని, వినియోగదారుడు తన అప్లికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల హార్డ్‌కాపీలు తమకు ఇవ్వలేదని కారణం చూపిస్తూ కనెక్షన్ ఇవ్వలేదు. ఈ ఫైల్‌ను కదిలించడానికి 63 రోజులు పెండింగ్ పెట్టి చివరకు రిజెక్ట్ చేశారు. హార్డ్ కాపీలు సమర్పించాలంటూ ఒక నిర్ణీత తేదీని చెప్పి ఆలోగా ఇవ్వకపోతే రిజెక్ట్ చేస్తే పద్ధతిగా ఉంటుంది కానీ కావాలని చేసిన పనితో డిస్కంలో ఉన్నతాధికారి తీరుపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ రశీదు ఈనెల 20న అదే భవనానికి సంబంధించి ఎస్పీడీసీఎల్ అధికారులు కనెక్షన్ ఇస్తామంటూ ఇచ్చినది. ఇక్కడ కూడా దరఖాస్తుదారుడు ఆన్లైన్లో ఐప్లె చేసిన తర్వాత అతడి అప్లికేషన్‌ను స్వీకరిస్తున్నామని, ఎస్టిమేషన్ డబ్బులు చెల్లించమని చెప్పినది. వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే 24న కనెక్షన్‌కు సంబంధించిన అనుమతులు ఇచ్చింది.