నివర్ ముప్పు!

- తీరం దాటేటప్పుడు తుఫాన్ మరింత తీవ్రం
- తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో వర్షాలు
- చెన్నైలో కుండపోత.. రహదారులు జలమయం
- నేడు కూడా సెలవు ప్రకటించిన పళనిస్వామి
- పుదుచ్చేరిలో 144 సెక్షన్.. రోడ్లు నిర్మానుష్యం
చెన్నై, నవంబర్ 25: నివర్ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా గురువారం తెల్లవారుజామున తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ‘తీవ్ర తుఫాన్‌గా మారిన నివర్.. చెన్నైకి 160 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుదుచ్చేరిలోని కరైకల్-చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తీరందాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంద’ని ఐఎండీ పేర్కొంది. ఆ సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
లక్ష మంది తరలింపు
చెన్నై సహా తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఉద్ధృతమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం చెన్నైలో 16 సెంటిమీటర్లు, పుదుచ్చేరిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న చెన్నై సహా 13 జిల్లాల్లో గురువారం కూడా తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లక్ష మందికిపైగా ప్రజలను తుఫాన్ షెల్టర్లకు తరలించినట్లు తెలిపింది. చెన్నై నుంచి వెళ్లే 26 విమానాలు, కోయంబత్తూరు, బెంగళూరు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నైలో చెంబరంబాక్కం సహా పలు జలాశయాలు నిండిపోయాయి. అదనపు నీటిని అడయార్ నదిలోకి విడుదల చేశారు. పుదుచ్చేరిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. 144 సెక్షన్ విధించడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, కడప జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు రైళ్లు రద్దు.. హెల్ప్ లైన్ల ఏర్పాటు
నివర్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారిమళ్లించారు. హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య తెలిపారు. సికింద్రాబాద్: 040-27833099, విజయవాడ: 0866-2767239, గుంతకల్: 78159 15608, గుంటూరు: 0863 2266138 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్-తాంబరం, తాంబరం-హైదరాబాద్ రైళ్లను రద్దు చేశారు.
నేడు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు!
నివర్ తుఫాన్ ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇంచార్జి డైరెక్టర్ నాగరత్న తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు