Crime news : మొబైల్ ఫోన్ కోసం ప్రియుడు పడిన కక్కుర్తి.. ఓ హత్య కేసులో లవర్స్ ఇద్దరూ కటకటాల పాలయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ (Delhi) లోని అలీపూర్ (Alipur) కు చెందిన ప్రీతమ్ ప్రకాష్ (Pritam Prakash), సోనియా (Sonia) ఇద్దరూ దంపతులు. ప్రీతమ్ ప్రకాష్‌కు నేరచరిత్ర ఉండటంతో సోనియా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ సోనియా పట్టుబట్టి అతడిని పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత మార్చుకోవచ్చని భావించింది. అందుకోసం ఏళ్లుగా ప్రయత్నించింది. కానీ ప్రీతమ్ మారలేదు. దొంగతనం, కిడ్నాప్, భౌతిక దాడుల కేసుల్లో తరచూ కటకటాల వెనక్కి వెళ్లి వస్తుండేవాడు. ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉండేవాడు. వారి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రానురాను ప్రీతమ్ మారకపోగా సోనియా చిత్రహింసకు గురిచేయడం మొదలుపెట్టాడు.
మద్యం మత్తులో వచ్చి రోజూ తీవ్రంగా కొడుతుండేవాడు. ఈ క్రమంలో 2023లో నేర చరిత్ర కలిగిన క్యాబ్ డ్రైవర్ రోహిత్‌తో సోనియాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో 2024 జూలై 2న ప్రీతమ్, సోనియాల మధ్య పెద్ద గొడవ జరిగింది. సోనియాను ప్రీతమ్ దారుణంగా కొట్టాడు.
దాంతో ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్లింది. క్యాబ్ డ్రైవర్ రోహిత్‌ను పిలిపించుకుని హర్యానా రాష్ట్రం సోనిపట్‌లోని తన సోదరి ఇంటికి బయలుదేరింది. కారులో వెళ్తుండగా.. తన భర్త ప్రీతమ్‌ను హత్య చేయమని రోహిత్‌ను కోరింది. దాంతో అతడు తాను నేరాలు మానేసి క్యాబ్ నడుపుకుంటున్నానని, మళ్లీ హత్య చేయలేనని చెప్పాడు. కానీ ఓ ఆరు లక్షలు ఇస్తే కిరాయి హంతకులను మాట్లాడుతానని తెలిపాడు.
అంత డబ్బులేకపోవడంతో సోనియా సైలెంట్‌గా ఉండిపోయింది. రోహిత్ ఆమెను సోనిపట్ తన సోదరి ఇంటి దగ్గర దించి వెళ్లాడు. జూలై 5న సోనియాను తీసుకొచ్చుకునేందుకు ప్రీతమ్ సోనిపట్‌కు వెళ్లాడు. అయితే అతనితో వెళ్లేందుకు సోనియా నిరాకరించింది. దాంతో అక్కడ కూడా ఆమెపై దాడిచేశాడు. దాంతో భర్త హత్య కోసం సోనియా తన సోదరి మరిది అయిన విజయ్‌ని సంప్రదించింది.
విజయ్ తనకు ఒక లక్ష రూపాయలు ఇస్తే ప్రీతమ్ చంపేస్తానని చెప్పాడు. దాంతో తాను రూ.50 వేలు ఇవ్వగలనని చెప్పింది. ఆ తర్వాత ప్రీతమ్ ఇంటికి వెళ్దామని సోనియాతో మరొసారి గొడవపెట్టుకున్నాడు. దాంతో తాను ఇప్పుడు రానని, పొద్దున వెళ్దామని, రాత్రికి ఇక్కడే పడుకోమని చెప్పింది. అందుకు ప్రీతమ్ ఒప్పుకున్నాడు. రాత్రి సోనియా, ఆమె సోదరి, సోదరి భర్త స్లాబ్‌పైన పడుకోగా, ప్రీతమ్, విజయ్ కింద పడుకున్నారు.
అర్ధరాత్రి సమయంలో ప్రీతమ్‌ను విజయ్ హత్యచేశాడు. శవాన్ని ఓ డ్రైనేజీలో పడేశాడు. ఆ తర్వాత సోనియా విజయ్‌కి రూ.50 వేలు ఇచ్చింది. తన భర్త ప్రీతమ్ ఫోన్ తీసుకుని అలీపూర్కి వెళ్లింది. భవిష్యత్తులో తనపై అనుమానం రాకుండా భర్త కనిపించకుండా పోయాడని కేసు పెట్టింది. ఆ తర్వాత రోహిత్‌తో కలిసి ఉండసాగింది. ఈ క్రమంలోనే ప్రీతమ్ ఫోన్‌ను రోహిత్‌కు ఇచ్చి ధ్వంసం చేయమని చెప్పింది. కానీ రోహిత్ ఆ ఫోన్ కోసం కక్కుర్తిపడి దాన్ని దాచిపెట్టుకున్నాడు.
కొన్నాళ్ల తర్వాత సోనిపట్‌లో పోలీసులకు ప్రీతమ్ మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసి, ఫార్మాల్టీ ప్రకారం డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిపెట్టారు. ఏడాది తర్వాత రోహిత్ తాను దాచిపెట్టుకున్న ప్రీతమ్ ఫోన్‌ను వాడటం మొదలుపెట్టాడు. అప్పటికే ఆ ఫోన్‌ను ట్రాకింగ్‌లో పెట్టిన పోలీసులకు పట్టుబడ్డాడు. మొదట ఆ ఫోన్‌ను వేరేచోట కొన్నానని బుకాయించిన రోహిత్.. ఆ తర్వాత నిజం చెప్పాడు.
ప్రీతమ్ హత్య విషయం అంతా వివరించాడు. దాంతో పోలీసులు సోనియాను, రోహిత్‌ను ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విజయ్ అప్పటికే వేరే దొంగతనం కేసులో అరెస్టయ్యాడు. ఇదిలావుంటే రోహిత్.. సోనియాతో వివాహేతర బంధం కొనసాగిస్తూనే ఈ ఏడాది ఏప్రిల్ మరో యువతిని వివాహం చేసుకున్నట్లు అతడి అరెస్ట్‌తో బయటపడింది.