వాళ్లంతా అతిరథులు. జీవనయానంలో ఒడుదొడుకులు ఎదుర్కొని రాటుదేలిన మహారథులు. ఏ సారథి లేకుండానే అన్నీ గెలిచిన వీళ్లు జీవిత చరమాంకాన్ని జోష్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా.. ఏదో వెలితి అనుభవిస్తున్న పెద్దలకు ఏ దిగులు లేకుండా చేస్తున్నారు సీనియర్ సాథీ వలంటీర్లు.
మహాసారథులై ఈ అతిరథులను సంతోషాల బాట పట్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని అపార్ట్మెంట్లలో పెద్దల కోసం పిల్లలు నడిపే సీనియర్ సాథీ క్లబ్స్ కుటుంబ సంతోషాలకు కొత్త దారి చూపుతున్నది.
వీకెండ్ లైఫ్‌ని యూత్ ఎంజాయ్ చేస్తుంటుంది. యూత్ కంటే మేమే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నామంటున్నది ఆరు పదులు దాటిన ఈ బ్యాచ్! హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ దగ్గరలో విజయనగర్ కాలనీలో ఉంటుంది శాంతి నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ సంస్థ క్లబ్లో వీకెండ్ భలే సంతోషంగా గడిచిపోతుంది. వారాంతంలో ఫ్రెండ్స్‌తో కలిసి పిల్లలు బయటికివెళ్తే అపార్ట్మెంట్లు సందడి లేక బోసిపోయి ఉంటాయి. కానీ, శాంతి నగర్‌లోని అపార్ట్మెంట్లు మాత్రం కోలాహలంగా మారిపోతాయి. అక్కడి పిల్లలంతా చేరి ఆడిపాడుతుంటే ఏర్పడ్డ సందడి కాదది. వయోవృద్ధులంతా ఒకచోటకు చేరి చేసే అల్లరి! వినడానికి వింతగా ఉంది కదా! కీళ్ల నొప్పులు, ఆరోగ్య సమస్యలు, కంటి చూపు మసకబారి, బలం తగ్గి.. శరీరమే భారమని భావించే వయసులో ఆటపాటల్లో ఉత్సాహంగా గడపడం ఏంటని? అనుమానం రాకుండా ఉండదు.
పైగా వీళ్లంతా చకచకా నడిపే పిల్లలు కాదు. అరవై నుంచి ఎనభై దాటిన వృద్ధులు. కంటి చూపు మసకబారిన వారు కొందరు. రకరకాల రుగ్మతలతో సావాసం చేస్తున్నవారు ఇంకొందరు. వీరందరినీ అలరించడానికి వారాంతంలో కొందరు యంగ్ తరంగ్‌లు రంగంలోకి దిగుతారు. వాళ్లే సీనియర్ సాథీ వలంటీర్లు. చదరంగంలో ఏ గడిలో గుర్రం దౌడుకు సిద్ధంగా ఉందో, ఎటు నుంచి ఏనుగు బలం, బలగం మొహరించి ఉన్నాయో చెబుతుంటే, వింటూనే పెద్దలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. ఒక్క చదరంగమే కాదు. పజిల్స్ నింపే ఆసక్తి ఉన్న తాతకు ప్రశ్నావళి చెబుతూ అడ్డం, నిలువు గడులు నింపుతూ సాయపడతారు. సాహిత్యాభిలాష ఉన్నవారికి కావాల్సిన పుస్తకం వెదికి, చేతిలో పెడతారు. చదవలేని వారికి కంటిచూపుగా మారి, కోరుకున్న సాహిత్యాన్ని చదివి వినిపిస్తారు. వీకెండ్స్‌లో పత్రికలు, మ్యాగజైన్స్ వారి చేతికిచ్చి ఖాళీగా ఉన్నామనే ఆలోచనే రాకుండా ఈ పిల్లలు తోడుంటారు. ఈ యువకులు, ఆ వయోవృద్ధులది రక్త సంబంధం కాదు. వీళ్లది ‘సీనియర్ సాథీ’ సంబంధం.

ఇళ్లు లేనివాళ్ల కోసం, పిల్లలు లేని పెద్దల కోసం వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉంటాయి. అందరూ ఉండి, అందరూ ఒకేచోట ఉండలేని ఇళ్లున్న వారి కోసం ‘సీనియర్ సాథీ’ ఏర్పాటైంది. శాంతి నగర్ క్లబ్‌లోనే కాదు, మెహదీపట్నం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, నగరంలోని మరికొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోనూ పెద్దలకు సాయపడే ‘సీనియర్ సాథీ’లున్నారు. వాళ్లే అపార్ట్మెంట్లు, కమ్యూనిటీ అసోసియేషన్లకు వచ్చి పెద్దల క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో కలిసి బుక్ రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. మనిషి వార్ధక్యంలో నలుగురిలో ఉండాలనుకుంటాడు. నాలుగు మాటలు చెప్పుకొనే తోడు కావాలనకుంటాడు. కానీ, ఎవరి ఫ్లాట్‌కు వాళ్లు పరిమితమైన అపార్ట్మెంట్ కల్చర్‌లో ఆ అవకాశం వారికి దక్కదు. భారంగా బతుకీడుస్తున్న పెద్దల కోసం గోడల్లేని ఇంటిని ఏర్పాటు చేస్తున్నది సీనియర్ సాథీ. ఆ ఇంట్లోకి ప్రవేశించిన వారందరికీ… ఆనందం ఖాయం.
పుస్తక పఠనం, పత్రికా పఠనంతోపాటు ఆటలు, ఆరోగ్య ముచ్చట్లు, ఆర్థిక చర్చలు జోరుగా సాగుతాయి ఇక్కడ. పెద్దల సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు చర్చిస్తుంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా చెప్పుకొంటారు. దానికి పరిష్కారం తెలిసినవాళ్లెవరో ముందుకు వచ్చి సలహా ఇస్తారు. ఇలా ఒకరికి ఒకరు తోడవుతున్నారు. రిటైర్మెంట్ డబ్బులు, ఎఫ్డీలు, పీఎఫ్, పెన్షన్, నగదు బదిలీ సమస్యలు ఉన్నాయనుకోండి.. వాటికి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పరిష్కారం చెబుతాడు. ఒంట్లో ఏదో నలతగా ఉంటే విశ్రాంత డాక్టర్ సరైన సలహా ఇస్తాడు. ఆస్తి గొడవలు, డాక్యుమెంట్ సమస్యలు అందరికీ ఉండేవే. వీటికి వృత్తి మానేసినా అనుభవం గడించిన లాయర్లు, అధికారులు ఏం చేయాలో సూచిస్తారు. సలహాలు వినగానే పనులైపోవు. హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకోవాలి. ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోవాలి. ఇతర పనుల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిందే. ఇవన్నీ చేయడానికి ఎవరూ తోడుండరు. పిల్లలు ఎక్కడో ఉద్యోగ జీవితంలో బిజీగా ఉంటారు. అలాంటి తాతలకు, అవ్వలకు సాయపడేందుకు సీనియర్ సాథీ వలంటీర్లు మనవడు, మనుమరాలి అవతారం ఎత్తుతారు.

పెద్దలకు వయసు రీత్యా ఉండే సమస్యలే కాకుండా ఇప్పుడు టెక్నాలజీ సమస్యలు కూడా అధికమయ్యాయి. డిజిటల్ లావాదేవీలు చేయలేక డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో ఉంటున్నారు! డిజిటల్ అరెస్ట్, లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న కేసుల్లో పెద్దలే అధికం. ఈ సమస్యను గుర్తించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన చొరవతో సీనియర్ సాథీ ఆలోచన మొగ్గ తొడిగింది. సీనియర్ సిటిజన్ల సమస్యలను పరిష్కరించేందుకు యంగిస్థాన్ ఫౌండేషన్‌ని భాగస్వామ్యంతో సీనియర్ సాథీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్దలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలనే ఆలోచనతో మొదలైన ఈ కార్యక్రమం మొదట ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టింది. స్మార్ట్ ఫోన్ వాడకం, ఆన్లైన్ ఆర్డర్లు, యాప్‌లతో జాగ్రత్తలు, యూపీఐ వాడకం, నెట్ బ్యాంకింగ్ గురించి పెద్దలకు శని, ఆదివారాల్లో అవగాహన కల్పిస్తారు. ఈ పని కోసం ఆసక్తి ఉన్న యువతను స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ఎంపిక చేశారు. ఇందులో డబ్బు మంది ఇంజినీరింగ్, ఎంబీఏ ఇతర చదువులు చదివిన యువత, వివిధ ఉద్యోగాలు చేసేవాళ్లున్నారు. వీరందరికీ పెద్దల శారీరక సమస్యలు, అవసరాలు, వాళ్లని ఎలా అర్థం చేసుకోవాలో శిక్షణ ఇచ్చారు. వీరంతా వారాంతాల్లో పెద్దల చేతిలో చెయ్యి వేసి హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు. పుస్తకాలు చదివిస్తున్నారు. సరదాగా ఆడిస్తున్నారు. వాళ్లతో సంతోషంగా గడిపేస్తున్నారు.
సీనియర్ సాథీ పెద్దలకే కాదు యువతీయువకులకూ మేలు చేస్తున్నది. పెద్దవాళ్లకు సాయపడటం వల్ల ఇంట్లో పెద్దలకు ఉండే అవసరాలేమిటో వారికి అవగాహన పెరుగుతున్నది. వాళ్లని అర్థం చేసుకోగలుగుతున్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో ఎంతో అనుభవం ఉన్నవాళ్లతో పరిచయం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. గతేడాది నవంబరులో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి పెద్దల నుంచి స్పందన, సహకారం ఉంది. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యునిటీల నుంచి సీనియర్ సాథీ ఆధ్వర్యంలో క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ఆహ్వానాలొస్తున్నాయి. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఈ సేవల కోసం admin@youngistaanfoundation.orgకి మెయిల్ చేస్తే మా సేవలు మరింత విస్తరిస్తాం. వీటి వల్ల పెద్దలకు కాలక్షేపమే కాదు, పిల్లలకు (వలంటీర్లకు) జ్ఞానం అందుతున్నది. ఇంట్లో నాయనమ్మ, తాత లేని లోటూ తీరుతున్నది!
– అరుణ్ డానియెల్ డైరెక్టర్, యంగిస్థాన్ ఫౌండేషన్
– నాగవర్ధన్ రాయల