Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ త్వరలోనే వెండితెరపై డబుల్ రోల్లో సందడి చేయబోతున్నారు. డైరెక్టర్ నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ (Ramayana) లో రణ్బీర్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవలే హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ‘రామ గ్లింప్స్’ (Teaser) పై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ గ్లింప్స్ విడుదలైన అనంతరం రణ్బీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను కేవలం శ్రీరాముడి పాత్ర మాత్రమే కాకుండా, విష్ణుమూర్తి మరో అవతారమైన మహర్షి పరశురాముడి పాత్రను కూడా పోషిస్తున్నట్లు క్లారిటీనిచ్చాడు. దీంతో ఈ వార్త విన్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
శ్రీరాముడు ఒక అవతారమైతే, ఆయన కంటే ముందు వచ్చిన అవతారం పరశురాముడు. ఈ రెండు దివ్యమైన పాత్రలను ఒకే సినిమాలో చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ రెండు పాత్రల బాడీ లాంగ్వేజ్, స్వభావాలు వేరు. సినిమా షూటింగ్కు ముందు ఒక సంవత్సరం పాటు ఈ రెండు క్యారెక్టర్ల మూలాలను, వాటి వెనకున్న ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను అని రణ్బీర్ పేర్కొన్నాడు. నమిత్ మల్హోత్రా దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ భారీ విజువల్ వండర్ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.