గురువారం 09 జూలై 2020
National - Jun 15, 2020 , 01:27:48

ఆశా దీపాలు!

ఆశా దీపాలు!

  • తుది దశ ట్రయల్స్‌కు చేరుకుంటున్న కరోనా వైరస్‌ టీకాలు
  • భారీ సంఖ్యలో ఉత్పత్తికి ఇప్పటికే ప్రణాళికలు
  • ప్రయోగాలు విజయవంతం కావడమే తరువాయి

ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే చర్చ.. కరోనాకు టీకా ఎప్పుడు వస్తుందా.. రోజూ భయం భయంగా జీవించడం ఎప్పుడు తొలిగిపోతుందా అని. వైరస్‌ బయటపడ్డప్పటి నుంచి ఆరోగ్య శాస్త్రవేత్తలు టీకా తయారీ మీదనే దృష్టి పెట్టారు. తమ శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని టీకాలు ఇప్పటికే కొన్ని హ్యూమన్‌ ట్రయల్స్‌ దశకు వెళ్లాయి. ఏ మందు, టీకా సక్సెస్‌ అయినా వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి దిగ్గజ ఔషధసంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. వివిధ దేశాల్లో కరోనా టీకా తయారీ ఏ దశల్లో ఉందో చూద్దాం.

న్యూఢిల్లీ, జూన్‌ 14: చైనాలోని ప్రముఖ ఫార్మా సంస్థ సైనోవాక్‌ బయోటెక్‌ కరోనావాక్‌ పేరుతో కొవిడ్‌ టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఇది ఇప్పటికే రెండు దశల హ్యూమన్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నది. జూలైలో 9 వేల మందిపై ఆఖరి, మూడోదశ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఈ దశలో విజయవంతమైతే టీకాను మార్కెట్‌లో విడుదల చేయడానికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. సైనోవాక్‌ కంపెనీ తమ టీకాలను భారీగా ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే బ్రెజిల్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. తమ టీకా కరోనాను అంతం చేస్తుందని ఆ సంస్థ ధీమా వ్యక్తం చేస్తున్నది.

రెండో దశలో మోడెర్నా: అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మోడెర్నా ఇన్‌కార్పొరేషన్‌ ‘ఎంఆర్‌ఎన్‌ఏ 1273’ టీకాతో 6వేల మందిపై రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నది. జూలైలో 30 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు చేయనున్నట్టు తెలుస్తున్నది. కరోనా నుంచి రక్షణకు ఎంఆర్‌ఎన్‌ఏ 1273 ఒక్క డోసు సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని చెప్తున్నారు. ఈ టీకా విజయవంతమైతే ఏడాదిలో 50 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.  

3 నెలల్లో ఏజడ్‌డీ 1222: అమెరికాకు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, బ్రిటన్‌కు చెందిన అస్ట్రాజెనెకా సంయుక్తంగా ‘ఏజడ్‌డీ 1222’ టీకాను అభివృద్ధిచేశాయి. ఇది ప్రస్తుతం రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నది. దాదాపు 10వేల మందిపై దీనిని ప్రయోగిస్తున్నారు. మూడో దశ ట్రయల్‌ను బ్రెజిల్‌లో నిర్వహించనున్నారు. సాధారణ జలుబు కలిగించే వైరస్‌కు, స్పైక్‌ ప్రోటీన్‌ను జోడించడం ద్వారా దీనిని తయారుచేశారు. ఇది ప్రస్తుతం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది.  టీకా సక్సెస్‌ అయితే మూడు నెలల్లోనే భారీగా ఉత్పత్తి చేసేందుకు ఫార్మా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను ఉత్పత్తి చేసేందుకు ఇండియాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ కూడా వర్సిటీతో కలిసి పనిచేస్తున్నది. 

వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థల్లో శాస్త్రవ్తేత్తలు, వైద్య నిపుణులు కరోనా టీకా కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ కరోనాకు అత్యంత చౌకగా టీకాను తెచ్చేందుకు కృషి చేస్తున్నది. ఈక్విటీ గ్లోబల్‌ హెల్త్‌ అనే సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకాను తయారు చేస్తున్నది. సోమవారం దీనికి మొదటి దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ జరగున్నాయి. కరోనా దిగ్గజ ఔషధ సంస్థ ఎలీ లిల్లీ మూడు యాంటీబాడీ పరీక్షలను అభివృద్ధి చేస్తున్నది. వీటిలో రెండు ఇప్పటికే హ్యూమన్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నాయి. మరో విధానం కొద్ది రోజుల్లో హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు రానుంది. కేవలం టీకాలే కాకుండా వైద్యులు ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులను కూడా పరీక్షిస్తున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌, రెమ్‌డెసివిర్‌ ఆ కోవలోకే వస్తాయి. శాస్త్రవేత్తల కృషి త్వరగా ఫలించి టీకా అందుబాటులోకి వస్తే మనం మళ్లీ మన సాధారణ జీవనానికి వెళ్లిపోవచ్చు.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌: జలుబుకు కారణమైన ఎడినో వైరస్‌ ఆధారంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ కొవిడ్‌ టీకాను తయారుచేసింది. దీనికి వచ్చే నెలలో హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ట్రయల్స్‌ కోసం అమెరికా, బెల్జియం దేశాలకు చెందిన 1,054 మందిని ఎంపిక చేశారు. వాస్తవానికి ఈ టీకా సెప్టెంబరులో హ్యూమన్‌ ట్రయల్స్‌కు వెళ్తుందని భావించారు. కానీ పరిశోధనల్లో వేగం కారణంగా రెండు నెలల ముందే ఆ దశకు చేరుకున్నది. 

ఎనిమిదో రోజూ చమురు వాత

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఎనిమిదో రోజు కూడా పెరిగాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 62 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 64 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75.78, లీటర్‌ డీజిల్‌ ధర రూ.74.03కు చేరింది. మొత్తంగా లెక్కిస్తే ఎనిమిది రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.4.52, డీజిల్‌పై రూ.4.64 పెరిగింది.

పాక్‌ కాల్పులు, నేలకొరిగిన జవాన్‌ 

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలోని సరిహద్దుల్లో నియంత్రణరేఖ వెంట పాక్‌ కాల్పులకు తెగబడింది.  ‘శనివారం రాత్రి పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం విచక్షణారహిత కాల్పులకు దిగింది. భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. కాల్పుల్లో లుంగాంబుయి అబోన్మెయి అనే సైనికుడితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించగా అబోన్మెయి చికిత్సపొందుతూ ప్రాణాలు వదిలారు’ అని రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.  


logo