శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 22:20:23

ఛత్తీస్‌గఢ్‌లో పలు చోట్ల ఆగస్టు 6 వరకు లాక్‌డౌన్‌

ఛత్తీస్‌గఢ్‌లో పలు చోట్ల ఆగస్టు 6 వరకు లాక్‌డౌన్‌

రాయ్‌పూర్‌ : రాష్ట్రంలోని రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌తో సహా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఆగస్టు 6వ తేదీ వరకు పొడగించాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సోమవారం నిర్ణయించినట్లు ఓ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి భూపేశ్‌ బాగెల్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ మంత్రులు, ఉన్నతాధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో ఇక్కడి అధికారిక నివాసంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజా సంబంధాల శాఖ అధికారి పేర్కొన్నారు. సమావేశం అనంతరం వ్యవసాయ మంత్రి రవీంద్ర చౌబే మీడియాకు వెల్లడించారు. రాయ్‌పూర్‌, దుర్గ్‌, బిలాస్‌పూర్‌ వంటి ప్రధాన నగరాల్లో కొవిడ్‌-19 కేసులు పెరగడం దృష్ట్యా ఈ ప్రాంతాల్లో అమలులో ఉన్న వారం రోజుల లాక్‌డౌన్‌ను పొడగించేందుకు నిర్ణయించారు.

కరోనా వైరస్‌ హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా పాటించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు. ఎక్కువ కరోనా కేసులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో రోగులకు అవసరమైన పడకలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చౌబే చెప్పారు. అలాగే ఖరీఫ్‌లో పంటల సాగుకు ఈ నెల 28 నుంచి జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలోని 28 జిల్లాలో ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలో 7,613 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 2,626 క్రియాశీల కేసులుండగా, మరో మంది 4,944 డిశ్చార్జి అయ్యారు. 43 మంది వైరస్‌తో మృతి చెందారు. ఇప్పటి వరకు 2,187 కేసులతో రాయ్‌పూర్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర రాజధానిలో పెరిగిన కేసుల దృష్ట్యా అధికారులు ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు రాయ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, బిర్గావ్‌ మున్సిపల్‌ (బీఎంసీ) ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం కఠిన లాక్‌డౌన్‌ విధించింది.

అలాగే బిలాస్‌పూర్‌, కోర్బా, అంబికాపూర్, దుర్గ్, ముంగేలి, బెమెతారా, రాజ్‌నందగావ్‌తో సహా వివిధ ప్రాంతాల్లో గత వారం లాక్‌డౌన్‌ విధించారు. లాక్‌డౌన్‌ సమయంలో అన్ని ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేశారు. అలాగే బస్సులు, టాక్సీలు, ఆటో రిక్షాలతో సహా ప్రజా రవాణా సేవలు పనిచేయవు అని అధికారి తెలిపారు. నిత్యావసర సేవల్లో నిమగ్నమైన ప్రైవేటు వాహనాలు లేదా నిత్యవసర వస్తువుల రవాణాను అనుమతించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయలు, పండ్లు, గుడ్లు, మటన్‌, చికెన్‌, చేపలను వేర్వేరు సమయాల్లో అమ్మడానికి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo