పాట్నా: వేగంగా వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. (Car Rams Truck) అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యాపారులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. రాజధాని పాట్నాతో పాటు పరిసర జిల్లాల్లో పురుగుమందులు, వ్యవసాయ ఉత్పత్తుల బిజినెస్ చేస్తున్న ఐదుగురు వ్యాపారులు బిజినెస్ పని కోసం ఫతుహాకు కారులో వెళ్లారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాట్నాకు తిరిగి వస్తున్నారు.
కాగా, పర్సా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుయా మోర్ సమీపంలో జాతీయ రహదారి నంబర్ 83పై వేగంగా వెళ్తున్న ఆ కారు లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం లారీ కిందకు చొచ్చుకెళ్లి ఇరుక్కుపోయింది. పెద్ద శబ్దం విన్న స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. గ్యాస్ కట్టర్లు, క్రేన్ సహాయంతో రెండు గంటలు శ్రమించిన తర్వాత మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు.
మరోవైపు కారు ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తులు వ్యాపారులని పోలీసులు తెలుసుకున్నారు. పాట్నాలో నివసించే 50 ఏళ్ల రాజేష్ కుమార్, 55 ఏళ్ల సంజయ్ కుమార్ సిన్హా, 38 ఏళ్ల కమల్ కిషోర్, 35 ఏళ్ల ప్రకాష్ చౌరాసియా, 38 ఏళ్ల సునీల్ కుమార్‌గా మృతులను గుర్తించారు. వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Vasundhara Raje | ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో.. వసుంధర రాజే రహస్య సమావేశం
Watch: దూకాలని సవాల్ చేసిన భర్త.. మేడ పైనుంచి కిందకు దూకిన భార్య