ఇటానగర్: ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. (Bridge Washes Away) దీంతో పలు గ్రామాలతో రాకపోకలు, సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా గ్రామస్తులు చిక్కుకుపోయారు. దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని మావాలి గ్రామంలో కీలకమైన సస్పెన్షన్ వంతెన వరదలకు నదిలో కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామంతో రాకపోకలతోపాటు కమ్యూనికేషన్ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా పిల్లలతో సహా గ్రామస్తులు అక్కడ చిక్కుకుపోయారు.
కాగా, మావాలి గ్రామస్తులతో సంప్రదింపులు జరిపేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మే 30న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లను జారవిడచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఎడతెగని వర్షం కారణంగా ఆ మిషన్ కూడా విఫలమైంది.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకు 30 మందికి పైగా మరణించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్ఫోర్స్తోపాటు రెస్కూ దళాలు ప్రయత్నిస్తున్నాయి.
Also Read: