వేములవాడ, ఫిబ్రవరి 26 : గుర్రపు పందేల బెట్టింగులకు అలవాటుపడిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. సీఎంవో అధికారినంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి పోలీసులకు దొరికిపోయాడు. వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఏఎస్పీ రుత్విక్‌సాయి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూర్ ప్రాంతానికి చెందిన రాయబండి సూర్యప్రకాశ్ రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని ప్రైవేట్ సంస్థల్లో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తూ మలక్‌పేటలో బెట్టింగ్‌లు పెట్టేవాడు.
ప్రభుత్వ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించి, తాను సీఎంవోలో పనిచేస్తున్నానంటూ ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి బెదిరించాడు. తన ఫోన్‌పే నంబర్‌కు డబ్బులు పంపాలని బెదిరించాడు. కొంత మంది డబ్బు పంపగా బెట్టింగ్‌లో ఖర్చు చేశాడు. ఈ నెల 23న బోయినపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మిడ్‌మానేరు ప్రాజెక్టు డీఈఈ రఘుపతికి ఫోన్ చేసి, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆయన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించన పోలీసులు సూర్యప్రకాశ్‌ను అరెస్టు రిమాండ్‌కు తరలించారు.