మనలో చాలామంది బరువు తగ్గడానికి ‘జిమ్’లోచేరి రోజూ గంటల తరబడి ట్రెడ్‌మిల్‌పై పరిగెడతారు. కానీ, వారం తర్వాత వెయింగ్ మెషిన్ ఎక్కితే.. ముల్లు ఇంచు కూడా కదలదు. అప్పుడు కలిగే అసహనం అంతా ఇంతా కాదు. ‘ఇంత కష్టపడుతున్నా ఎందుకు తగ్గట్లేదు?’ అనే ప్రశ్న నీడలా వెంటాడుతూనే ఉంటుంది. దానికి సమాధానం.. మీ దైనందిన అలవాట్లలోనే దాగి ఉంది. వర్కౌట్ అనేది కేవలం 30శాతం మాత్రమే. మిగిలిన 70శాతం మీరు చేసే పనులు, తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే వర్కౌట్స్తోపాటు తప్పనిసరిగా కొన్ని అలవాట్లు పాటించాలి.
వాటిల్లో ప్రధానమైంది తిండి. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. ‘ఈరోజు గంట వర్కౌట్ చేశాను కదా! ఒక బర్గర్ తింటే ఏమవుతుందిలే!’ అని అనుకుంటారు. దీన్నే ‘రివార్డ్ ఈటింగ్’ అని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని మీకు మీరు ఇచ్చుకోవడం ఆపేయకుంటే.. మీరు చేసిన వర్కౌట్‌కి తిన్నదానికి లెక్క కుదరదు. మీరు జిమ్‌లో కరిగించేది 300-400 క్యాలరీలు అయితే ఆ ఒక్క బర్గర్ ద్వారా తీసుకునేది 600-800 క్యాలరీలు. ఫలితంగా మీరు బరువు తగ్గకపోగా మరింత పెరుగుతారు. వర్కౌట్ చేశాం కదా! అని అదనపు ఆహారం తీసుకోవడం మీ ప్రయత్నాన్ని సున్నా చేస్తుంది సుమా! ఇక నిద్ర మరో ముఖ్యమైన ఫ్యాక్టర్.
ఇది లేకపోతే మెటబాలిజం డౌన్ అయిపోతుంది. చాలామంది ఫిట్నెస్ అంటే కేవలం వ్యాయామం అనుకొని ‘రికవరీ’ని మర్చిపోతారు. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ‘కార్టిసోల్’ పెరుగుతుంది. ఇది ఆకలిని పెంచే ‘గ్రెలిన్’ హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా మీరు చిరుతిళ్లపై పడతారు. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర లేకపోతే మీరు ఎంత వర్కౌట్ చేసినా ప్రయోజనం ఉండదు. మరోవైపు డైటింగ్ పేరుతో పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, కోల్డ్ కాఫీలు తాగేస్తుంటారు కొందరు.
ప్యాకేజ్డ్ జ్యూస్‌లలో ఉండే చక్కెర మీకు తెలియకుండానే వందల కొద్దీ క్యాలరీలను శరీరంలోకి పంపిస్తుంది. ఇవి మీకు కడుపు నిండిన భావనను ఇవ్వకపోగా.. బరువును అమాంతం పెంచేస్తాయి. నీళ్లకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదన్న విషయం గ్రహించండి. బరువు తగ్గడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. జిమ్‌లో గడిపే ఒక గంట కంటే.. మిగిలిన 23 గంటలు మీరు ఎలా ఉంటున్నారనేదే ఇక్కడ ముఖ్యం. సరైన ఆహారం, తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత.. ఈ మూడు తోడైతేనే మీ వర్కౌట్‌కు ఫలితం దక్కుతుంది. మీ బరువూ తగ్గుతుంది.