లక్నో: ఇంటి ఆవరణలోకి వచ్చిన కోతుల వల్ల కుమారుడికి హాని కలుగుతుందని వ్యక్తి భావించాడు. తరిమేందుకు కోతులపైకి గొడ్డలి విసిరాడు. అయితే రెండేళ్ల కుమారుడి మెడ తెగడంతో ఆ బాలుడు మరణించాడు. (Man Throws Axe At Monkeys, Slashes Son’s Neck) ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. రెండేళ్ల ఆరవ్ ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. కోతుల గుంపు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది.
కాగా, కోతులు తన కొడుకుపై దాడి చేస్తాయని తండ్రి లఖన్ సింగ్ ఆందోళన చెందాడు. మేడపైకి వెళ్లిన అతడు కోతులను తరిమేందుకు గొడ్డలి విసిరాడు. అయితే దురదృష్టవశాత్తు ఆరవ్‌కు గొడ్డలి తగిలింది. ఆ బాలుడి మెడ తెగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ చిన్నారి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు భార్యతో గొడవ వల్ల లఖన్ సింగ్ తన కుమారుడ్ని గొడ్డలితో నరికి హత్య చేశాడని బావమరిది ఆరోపించాడు. అయితే కోతులు మేడపై నుంచి ఇనుప రాడ్లను జారవిడిచాయని, బాలుడి తలకు తగలడంతో చనిపోయినట్లు లఖన్ సింగ్ బంధువు తెలిపాడు. కాగా, బాలుడి మరణంపై పోలీసులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా భావించారు.
Also Read: