Monsoon Session | పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)కు సంబంధించిన విషయాలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament Monsoon Session) తేదీలను ఖరారు చేసింది.
జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి (Parliamentary Affairs Minister) కిరెణ్ రిజిజు (Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. ఈ సమావేశాల్లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చించనున్నట్లు తెలిసింది. అంతేకాదు 23 రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రధానికి ఎంపీల లేఖ..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా.. కేంద్రంలోని మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ఈ వ్యవహారంపై యావత్తు జాతి జనుల్లో ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. దీనిపై ప్రధాని మోదీ సహా ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ నోరుమెదపడం లేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి ఘటన, అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షానికి చెందిన 16 పార్టీల ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీకి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖపై లోక్‌సభకు చెందిన 200 మందికి పైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు.
వేటిపై చర్చకు పట్టుబట్టారంటే?
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చర్చించాలని విపక్ష పార్టీల నేతలు మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కూడా ఈ సందర్భంగా చర్చించాలని పట్టుబట్టారు. సరిహద్దు గ్రామాల్లో పాక్ రేంజర్లు జరిపిన షెల్లింగ్‌లో ప్రాణాలు విడిచిన పౌరుల గురించి కూడా చర్చించాలని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తదనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో తమ ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతునిచ్చాయన్న విపక్ష నేతలు.. తమ డిమాండ్ మేరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read..
Operation Sindoor | మోదీ జాతికి జవాబు చెప్పండి! ప్రధానికి ఎంపీల లేఖ..!
Sindoor Abhiyan | బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్..! బీజేపీ సిందూరంపై మహిళల గరంగరం..!