రాజకీయం తలకెక్కితే ఉచితానుచితాలు తెలియవు. ఓట్ల మత్తులో మునిగితేలినప్పుడు ఏది మంచి ఏది చెడు అర్థం కాదు. అధికారమే అంతిమ లక్ష్యం అయినప్పుడు అడబిడ్డ కూడా ఓటుగానే కనిపిస్తుంది. బీజేపీపరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉన్నది.
సిందూరం అంటే వివాహ సమయంలో భర్త భార్య నుదుటిన దిద్దే కుంకుమ. అది మహిళ వైవాహిక స్థితిని, భర్త సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మహిళకు సిందూరాన్ని ఇచ్చే అర్హత భర్తకు మాత్రమే ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రక్రియను సిందూర దానం అంటారు.
పాకిస్థాన్‌పై సైనిక దాడికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నుంచి ఓట్లు ఎలా దండుకోవాలా? అనే ప్రయత్నంలో బీజేపీ పడ్డది. అందులో భాగంగా సిందూర్ అభియాన్ పేరిట ఓ కార్యక్రమాన్నిదాదాపు మొదలు పెట్టింది. ఇంటింటికీ వెళ్లి మహిళ లకు సిందూరాన్ని పంచడం దీని ఉద్దేశం.
గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌ని, సైనికుల త్యాగాలను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకున్న బీజేపీ, మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి అయోధ్య రామాలయ అక్షతలు పంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సిందూరాన్ని పంచి భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చని బీజేపీ నేతలు భావించినట్టు ఉన్నారు. అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది.
సిందూరంతో ఇంటింటికీ వెళ్తున్న బీజేపీ నేతలకు ఉత్తరాది మహిళలు ఎదురుతిరుగుతున్నారు. ‘నువ్వెవడివి సిందూరం ఇవ్వడానికి?నా మొగుడివా?’ అని వారు నిలదీస్తున్నారు. ‘దమ్ముంటే నా పాపిట సిందూరం దిద్ది చూపించు’ అని గల్లా పట్టిమరీ వారు సవాల్ విసురుతున్నారు. ‘మమ్మల్ని రక్షించలేని మీరు సిందూరం ఇస్తారా? ఈ గాజులేసుకొని వెళ్లిపోండి’ అని ముఖం మీదే తిడుతున్నారు.
ఈ వ్యతిరేకత భరించలేక బీజేపీ నేతలు అసలు తాము సిందూరం అభియాన్నే మొదలుపెట్టలేదని వివరణ ఇచ్చుకోలేక ఆపసోపాలు పడుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనేది యావత్ జాతి జనులకు ఓ భావోద్వేగ అనుభవం. భారత ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలపై మన జవాన్లు సాగించిన ఓ విజయ విహారం. అయితే, ‘రాజకీయాలకు కాదేదీ అనర్హం’ అన్నట్టు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ‘ఆపరేషన్ సిందూర్’ క్రెడిట్‌ను కొట్టేయడానికి ‘ఘర్ ఘర్ సిందూర అభియాన్’ పేరిట దేశవ్యాప్తంగా ప్రతీ గడపకూ సిందూరం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మూడో విడుత ఎన్డీయే పాలనకు ఈ నెల 9వ తేదీతో ఏడాది నిండుతుంది.
ఇదే సరైన సమయం అనుకొన్న బీజేపీ నేతలు.. ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని నెల రోజులపాటు కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్‌తో పాటు పలు టీవీ ఛానళ్లలోనూ వార్తలు ప్రసారమయ్యాయి. ‘సిందూర అభియాన్’ కార్యక్రమం 9న 6ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీకి, వచ్చే ఏడాది మార్చిలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లోని కొందరు స్థానిక బీజేపీ నేతలు ట్రయల్ రన్లో భాగంగా ఈ సిందూర అభియాన్‌ను ముందుగానే ప్రారంభించారు. అయితే, వారు ఊహించని పరిణామం ఇక్కడే ఎదురైంది. సిందూరాన్ని పంపిణీ చేయడానికి ఇంటింటికీ వెళ్లిన బీజేపీ కార్యకర్తలకు ఆ ఇంట్లోని ఆడపడుచుల నుంచి తిట్లు, ఈసడింపులే ఎదురయ్యాయి. ‘రాజకీయాలకు ఆపరేషన్ సిందూర్‌ను వాడుకోవడం ఏంటి?’, ‘పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోలేరు గానీ, సిందూరం పంపిణీ చేయడానికి వచ్చారా?’ అంటూ ఆయా మహిళలు బీజేపీ కార్యకర్తలపై దుమ్మెత్తిపోయడం పలు వీడియోల్లో కనిపిస్తున్నది. ‘భార్యకు భర్త సిందూరాన్ని ఇవ్వాలిగానీ, పార్టీ ఇవ్వడమేంట’ని బీజేపీ కార్యకర్తను ఓ మహిళ నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పీఐబీతో పోస్టులు
‘సిందూర అభియాన్’పై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని పక్కనబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే అసలు ఆ కార్యక్రమం తీసుకురావాలన్న చర్చే తమలో జరుగలేదని కమలనాథులు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ‘నాగ్‌పూర్ టుడే’ ఓ కథనంలో తెలిపింది. ‘సిందూర అభియాన్’ ఫేక్ ప్రచారమని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా వంటి నేతలు బుకాయించడం ప్రారంభించారు. ‘సిందూర అభియాన్’పై పత్రికల్లో వచ్చిన వార్తలను ఫేక్ న్యూస్ అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌తో పోస్టులు పెట్టించారు.
సిందూరం పేరిట ఓట్లు అడుక్కోవడమా?
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను రాజకీయ లబ్ధికి బీజేపీ వాడుకొంటున్నది. సిందూరం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం ఏంటి? ఈ చర్యలతో పవిత్ర సిందూరాన్ని బీజేపీ అపహాస్యం చేస్తున్నది.
– పంజాబ్ సీఎం భగవంత్ మాన్
మోదీజీ.. ముందు మీ భార్యకు ఇవ్వండి
ప్రతీ మహిళకు గౌరవం ఉంటుంది. భర్త నుంచి మాత్రమే మహిళ సిందూరాన్ని అంగీకరిస్తుంది. మీరు (మోదీ) దేశంలోని మహిళలందరికీ భర్త కాదు కదా?! ముందు మీ భార్యకు ఆ సిందూరాన్ని ఇవ్వండి.
-బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
‘మీ రక్షణ కోసమే సిందూర్‌ను పంపిస్తున్నారు..’ అన్న రిపోర్టర్‌పై మహిళలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీరెవరు సిందూరం ఇవ్వడానికి? నా భర్త నపుంసకుడా?’ అని ఓ మహిళ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మేం పెళ్లి చేసుకున్న వాడు మాకు రక్షణ కల్పిస్తాడు. మా ఇండ్లలోకి వచ్చి సిందూరం ఇచ్చేందుకు మీరెవరు? ప్రధాని ఇలాంటి నీచ పనులు చేస్తుంటే సిగ్గుగా ఉంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. తన భర్త తనకు సిందూరం తెచ్చి ఇస్తాడని, సిందూరం ఇచ్చేందుకు మీరెవరని మరో మహిళా ప్రశ్నించింది.
‘సిందూరాన్ని సోదరుడు ఎలా ఇస్తాడు. మీరు ఇస్తున్నారు బాగుంది. మేం తీసుకుంటాం. కానీ, దానిని నుదుటన దిద్దుతారా? సిందూరం ఇస్తే దానిని నుదుటన దిద్దాలి. ఇచ్చేవాళ్లు దిద్దాలి కదా!’ అంటూ తనకు సిందూరం ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తులను మహిళ నిలదీసింది. దీంతో తాను దిద్దలేనని ఆమెకు సిందూరం ఇవ్వజూపిన వ్యక్తి చెప్పారు. దీంతో ఆయనతో వచ్చిన వారిలో ఒకరికి ఆ సిందూరాన్ని దిద్దాలని అడగ్గా ‘నేనెలా దిద్దుతాను దీదీ’ అని అనడంతో, మరో వ్యక్తిని కూడా ఆమె అదే ప్రశ్న వేసింది. ఆయన కూడా సోదరికి తాను సిందూరాన్ని దిద్దలేని తనను క్షమించాలని కోరాడు. సిందూరాన్ని నుదుటన దిద్దలేనప్పుడు ఎందుకు ఇస్తున్నారని ఆమె ప్రశ్నించింది. అయినప్పటికీ వదలని వారు ఆమెను సిందూరం తీసుకోవాలని బతిమాలారు. తమకు రక్షణ కల్పించలేనప్పుడు సిందూరం ఇచ్చి ఏం లాభమని నిలదీస్తూ ఇంట్లోకి వెళ్లి గాజులు తెచ్చింది. ఈ గాజులు తొడుక్కుని తనకు సిందూరాన్ని దిద్దాలని అడగడంతో వారు బిక్కచచ్చిపోయారు. ఇది దేశభక్తికి సంబంధించిన విషయమని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె వినిపించుకోకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు.