హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా.. కేంద్రంలోని మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ఈ వ్యవహారంపై యావత్తు జాతి జనుల్లో ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. దీనిపై ప్రధాని మోదీ సహా ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ నోరుమెదపడం లేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి ఘటన, అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షానికి చెందిన 16 పార్టీల ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీకి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖపై లోక్‌సభకు చెందిన 200 మందికి పైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు.
వేటిపై చర్చకు పట్టుబట్టారంటే?
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చర్చించాలని విపక్ష పార్టీల నేతలు మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కూడా ఈ సందర్భంగా చర్చించాలని పట్టుబట్టారు. సరిహద్దు గ్రామాల్లో పాక్ రేంజర్లు జరిపిన షెల్లింగ్‌లో ప్రాణాలు విడిచిన పౌరుల గురించి కూడా చర్చించాలని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తదనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో తమ ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతునిచ్చాయన్న విపక్ష నేతలు.. తమ డిమాండ్ మేరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సైన్యానికి అభినందనలు చెప్తాం
‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని 16 పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పార్లమెంట్‌కు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజలకు పార్లమెంట్ బాధ్యతాయుతంగా ఉండాలి’ అని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియాన్ మీడియాతో అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా చేపట్టిన సైన్యానికి అభినందనలు తెలియజేస్తాం. అలాగే, పాక్‌ను ఏకాకిగా చేసి, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్రం తీసుకొన్న చర్యలు, ‘ఆపరేషన్ సిందూర్’పై నిజానిజాలను ప్రత్యేక సమావేశంలో చర్చిస్తాం’ అని కాంగ్రెస్ నేత దీపేంద్ర హుడా తెలిపారు. ‘కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో చర్చించాలి’ అని ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు.
సెషన్ కోసం.. ట్రంప్ వద్దకు వెళ్లాలా?
16 ప్రతిపక్ష పార్టీల నేతలు సంతకాలు చేసిన లేఖను ప్రధాని మోదీకి పంపాం. ఇది సాధారణమైన విషయం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు.. మేం ఎన్నిసార్లు కోరినా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకు ఏర్పాటు చేయరు? ప్రత్యేక సెషన్ ఏర్పాటు కావాలంటే మేం ట్రంప్ వద్దకు వెళ్లాలా?
-సంజయ్ రౌత్, శివసేన (యూబీటీ)
నరేందర్..సరెండర్ : రాహుల్
కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ మేరకు భోపాల్‌లో మంగళవారం ఓ కార్యక్రమంలో తీవ్ర విమర్శలు చేశారు. ‘బీజేపీ-ఆరెస్సెస్ నేతలపై కొంచెం ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్లు భయంతో పారిపోతారు. ట్రంప్ అక్కడి నుంచి మోదీకి ఫోన్ చేసి.. ‘నరేందర్.. సరెండర్’ అన్నారు. అంతే, ‘యెస్, సార్’ అంటూ మోదీ లొంగిపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?