పుణె, జూన్ 3: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్కు జరిగిన నష్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీదీఎస్) అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యానికి జరిగిన నష్టాలు ముఖ్యం కాదని, ఆపరేషన్ ఫలితం ఏమిటన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. మంగళవారం పుణె యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తమ తప్పులను గుర్తించి, సరిదిద్దుకునే సత్తా సాయుధ దళాలకు ఉందని, ఎదురుదెబ్బలకు చేష్టలుడిగి చూస్తూ నిలుచోలేదని వ్యాఖ్యానించారు. ‘మన వైపున జరిగిన నష్టాల గురించి కొందరు నన్ను అడిగారు.
ఇదంత ముఖ్యం కాదని నేను చెప్పాను. ఫలితాలు ఏమిటి.. మనం ఎలా వ్యవహరించాం అన్నదే ముఖ్యం. నష్టాల గురించి మాట్లాడడం అంత సబబు కాదు. మీరే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆడి ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందారనుకోండి. ఇక ఎన్ని వికెట్లు, ఎన్ని బంతులు, ఎంతమంది ప్లేయర్లు అన్న ప్రశ్నే ఎక్కడుంది? అని సీడీఎస్ ప్రశ్నించారు. కాగా, గత వారం సింగపూర్లో బ్లూమ్బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీడీఎస్ చౌహాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ ప్రాథమిక దశలో భారతీయ యుద్ధ విమానాలకు నష్టం జరిగిందని ఆయన అంగీకరించారు. అయితే సాయుధ దళాలు వెంటనే తమ తప్పులను సరిదిద్దుకుని మళ్లీ శత్రువుపై దాడి చేశాయని ఆయన చెప్పారు. నాలుగు రాఫెల్ విమానాలతోసహా మొత్తం ఆరు భారతీయ యుద్ధ విమానాలను తాము కూల్చివేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అది అవాస్తవమని స్పష్టం చేశారు.