Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. “వన్ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ స్పిరిట్ మోడ్” అనే ట్యాగ్‌తో విడుదల చేసిన పోస్టర్లో వివేక్ ఓబెరాయ్ నోట్లో సిగార్‌తో పవర్ఫుల్ యాక్షన్ లుక్‌లో కనిపించారు. పోస్టర్‌ను బట్టి ఆయన ఓ డాన్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే అదే పోస్టర్లో వివేక్ పక్కన కనిపించిన యువతి ఎవరు? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఆమె పేరు ఐశ్వర్య దేశాయ్. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఇండో-అమెరికన్ నటి. బాలీవుడ్ చిత్రం ‘గల్లీ బాయ్’లో నటించిన ఆమె, ‘ర్యాట్ ఇన్ ద కిచెన్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మంచి గుర్తింపు పొందారు. ఆ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ‘స్పిరిట్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. పోస్టర్లో వివేక్‌తో కలిసి కనిపించడం వల్ల సినిమాలో ఆమెకు కీలక పాత్ర ఉన్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క పోస్టర్‌తోనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పించాయి. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా, సీనియర్ నటి కాంచన కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు చూడని విధంగా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో పాటు పోలీస్ డ్రామా ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు టీజర్ సూచిస్తోంది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ అయిన ప్రభాస్ జైలుకు వెళ్లే సన్నివేశం స్టోరీపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు చైనీస్, కొరియన్ సహా పలు విదేశీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.