Northeastern States | నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో (Northeastern States) ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కిం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయలో కుంభవృష్టి కురుస్తోంది. ఈ కుంభవృష్టి కారణంగా ఎక్కడికక్కడ కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. ఈ వర్ష బీభత్సానికి ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత 10 రోజుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మిజోరాంలో ఐదుగురు మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు మంగళవారం తెలిపారు. చంపాయి జిల్లాలో ముగ్గురు, ఐజ్వాల్, సెర్చిప్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ఇళ్లు, గోడలు కూలిపోవడం వల్ల ఈ మరణాలు సంభవించినట్లు తెలిపారు.
ఇక రాష్ట్రంలోని 552 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. 152 ఇళ్లు దెబ్బతిన్నాయని (house damages) తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పగుళ్ల కారణంగా 198 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయినట్లు చెప్పారు. మొత్తం 11 జిల్లాల్లో మయన్మార్‌తో సరిహద్దును పంచుకునే తూర్పు మిజోరాంలోని చంపాయి జిల్లాపై తీవ్ర ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. ఇక్కడ 209 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు వివరించారు. తొమ్మిది ఇళ్లు దెబ్బతినగా.. 14 కుటుంబాలను ఖాళీ చేయించినట్లు చెప్పారు.
ఇక సెర్చిప్ జిల్లాలో 75 చోట్ల కొండచరియలు విరిగిపడగా.. 27 ఇళ్లు దెబ్బతిన్నాయని, కొండచరియలు విరిగిపడటం, పగుళ్లు, వరదల కారణంగా 132 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయినట్లు అధికారులు చెప్పారు. ఐజ్వాల్ జిల్లాలో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ఇళ్లు కూలిపోయాయి. ఖాజ్వాల్ జిల్లాలో 75 చోట్ల కొండచరియలు విరిగిపడగా, లుంగ్లీ జిల్లాలో 60, దక్షిణ మిజోరాంలోని సియాహా జిల్లాలో 53 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో సైతువల్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇక దక్షిణ జిల్లాలకు నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే వందకు పైగా ట్రక్కులు సెర్చిప్‌లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
గత మూడు రోజుల్లో ఐజ్వాల్ జిల్లాలో 253.7 మి.మీ వర్షపాతం నమోదైందని భారత వాతావణ శాఖ (IMD) తెలిపింది. ఖాజ్వాల్ జిల్లాలో 248.33 మి.మీ వర్షపాతం, సియాహా జిల్లాలో 241.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తన నివేదికలో వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Also Read..
Northeast Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. అస్సాం, సిక్కిం సీఎంలతో మాట్లాడిన ప్రధాని
Kamal Haasan | సత్యం ఎన్నటికీ తల వంచదు.. కన్నడ భాషపై వివాదం వేళ కమల్ హాసన్‌కు మద్దతుగా పోస్టర్లు