హైదరాబాద్, మార్చి 2 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో నిరుద్యోగ యువకుల అరెస్ట్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు యువత ఓట్ల కోసం అశోక్‌నగర్ చౌరస్తాలో పడిగాపులు గాసిన రాహుల్‌గాంధీ.. తెలంగాణలో గద్దెనెక్కిన తర్వాత అరెస్ట్‌లు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘నాడు ప్రజాస్వామ్య పాలన మా ఏడో గ్యారెంటీ అని ప్రగల్బాలు పలికి.. నేడు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకుతెచ్చేలా ప్రజాసంఘాల నాయకులను నిర్బంధించడం శోచనీయం’ అని వాపోయారు. ‘మాటల్లో ఏమార్పు, చేతల్లో అణచివేత.. ఇదే కాంగ్రెస్ అసలు నైజం’ అని దుయ్యబట్టారు.