‘ఆహా ఏమి రుచి’ అని లొట్టలేసుకుని తిన్న రోజులు మళ్లీ రావని బాధపడొద్దు. ఖండాంతరాలు దాటినా అమ్మ చేతివంట తిన్నంత కమ్మని రుచులను మైమరచి మళ్లీ తినొచ్చు! దూరదేశాల్లో తెలుగింటి వంట వండుకోవడం కష్టమేమీ కాదు. సంప్రదాయం, రుచి, ఆరోగ్యం కోసం రెడీమిక్స్ని రెడీ చేసుకోవడం ఎలాగో ‘హైదరాబాదీ రుచులు’ ఛానల్లో చూపిస్తుంది ఇందిరా ఐరేని. ఆ వీడియోలు చూస్తూ వండుకుంటే సరి. మన సంప్రదాయ రుచులను పరిచయం చేస్తూ, వాటిని కొత్తతరానికి నేర్పిస్తూ సాగిన తన వంటల ప్రయాణం గురించి ‘జిందగీ’తో ఇలా పంచుకుంది..
మా అమ్మ వంటలు బాగా చేస్తుంది. ఎవరూ చేయని రకరకాల పదార్థాలు వండేది. ఎగ్ కర్రీ బాగా చేసేది. ఒక ఎగ్ కర్నీలో వేస్తుంది. ఉడికించకుండానే కర్రీలో వేస్తుంది. పోపు వేసి, ఉల్లిపాయలు వేసి, నీళ్లు పోసిన తర్వాత అందులో పచ్చి కోడిగుడ్డును కార్చేది. ఆ కూర రుచి భలేగా ఉండేది. ఇంటికి ఎవరు వచ్చినా.. ‘ఏంటిది? ఎలా చేశారు?’ అనడిగేవారు. ఆ ఎగ్ కర్రీ నాకు ఇష్టం. అమ్మే నాకు వంటలు చేయడం నేర్పింది. పెళ్లయిన తర్వాతే నేను వంటలు నేర్చుకున్నాను. అమ్మకు ఫోన్ చేసి ఏది.. ఎలా చేయాలని అడిగేదాన్ని. వంటకాన్నిబట్టి ఓ పది నిమిషాలు, అరగంట మాట్లాడుకునేది. హైదరాబాద్ మూసాపేటలో అమ్మ వాళ్లు, మేము పక్కపక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్లం.
నాకు వంటలు చేయడం అంటే అంతగా ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. కానీ, పిల్లలకు మంచిగా వండి పెట్టాలని ఇష్టంగా చేస్తాను. చాలామందికి ఈ రోజుల్లో వంటలు చేయడం రాదు. ఏ వంట చేసుకోవాలన్నా యూట్యూబ్ చూస్తున్నారు. అలాంటి వాళ్లకు నాకు తెలిసినవి చెప్పాలని యూట్యూబ్‌లో ‘హైదరాబాదీ రుచులు’ ఛానల్ ప్రారంభించాను. తొమ్మిదేళ్ల క్రితం.. ఎవరికీ తెలియని బిళ్లల పులుసు వంటకంతో యూట్యూబ్‌లో వండటం మొదలుపెట్టాను. శనగపిండిని నీళ్లు కలిపి ముద్దగా చేసుకుని ఆవిరితో ఉడికించాలి. ఆ ముద్దను బిళ్లలుగా కట్ చేసుకుని పులుసులో వేసుకోవచ్చు. మా అమ్మ చేసే ఎగ్ కర్రీని ‘హైదరాబాదీ ఎగ్ కర్రీ’ పేరుతో చేసి అప్లోడ్ చేశాను. అంతకుముందు ఆ కర్రీ గురించి నెట్లో వెతికినా దొరికేది కాదు. నేను చేసిన తర్వాత నేర్చుకుని చాలామంది ఆ కర్రీని అప్లోడ్ చేశారు! ఇలా మొదలైన నా ప్రయాణంలో.. మా అమ్మ చేసే కమ్మని కోడి గుడ్డు కూరలే కాదు. నాకు నచ్చిన, మా వాళ్లు మెచ్చిన వెజ్, నాన్‌వెజ్ కర్రీలెన్నో వండాను. అప్లోడ్ చేశాను.
మా అమ్మమ్మ వాళ్లది నాగ్‌పూర్. కాబట్టి తెలుగు రుచులే కాకుండా నార్త్ ఇండియన్ టేస్ట్ కూడా నాకు అవగాహన ఉంది. నాకు వచ్చినవి, మా అమ్మకు వచ్చినవి అందరికీ చెప్పాలనే కోరిక. యూట్యూబ్ కోసం వండటం వీడియోల్లో చేసినంత సులభంగా ఉండదు. ఒక్కోసారి ఒకేసారి అయిపోతుంది. మరోసారి వండితే కుదురుతుంది. కానీ, కెమెరా ముందుకు పోయాక కుదరదు. ఇలా కెమెరా ఆన్ చేసిన తర్వాత వంటకం కుదిరేదాక మళ్లీమళ్లీ వండాల్సిందే. ఓసారి జిలేబీ కోసం అయిదు సార్లు వండాల్సి వచ్చింది. నూనె సరైన వేడిలో ఉంటేనే జిలేబీ బోలుగా వస్తుంది. ఆ ప్రయత్నంలో సఫలం కావడానికి చాలా కష్టపడ్డాను. ఒక్కోసారి పిండి, అవసరమైన కూరగాయలు అయిపోవచ్చు. అప్పుడు ఇంకో రోజు మళ్లీ చేయాలి. ఇలా జరగడం వల్ల జాగ్రత్తలు కూడా చెప్పే అనుభవం వస్తుంది. ఇన్ని కష్టాలుపడి పద్దెనిమిది వందల వీడియోలు చేశాను. వంటల కోసం నా టైమ్‌ని నేను సరిగా ఉపయోగించుకున్నాను. ఓవైపు ఫార్మాసిస్ట్ ఉద్యోగం చేస్తూనే.. ఈ వంటల ఛానల్‌ను నడిపిస్తున్నాను. రెండు పడవల ప్రయాణమైనా.. నాకు కష్టంగా అనిపించదు. అందరూ మొబైల్ ఫోన్, టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. నా సమయాన్ని వంటలకు కేటాయిస్తాను. ఆదివారాలు, పండుగ సెలవుల్లో పిల్లలతో కలిసి చేస్తాను. వాళ్లూ సహకరిస్తారు. వంట చేయడం, వీడియో తీయడంలో భాగమవుతారు. మా పిల్లల స్నేహితులకు నా యూట్యూబ్ వంటలు తెలుసు. బిర్యానీ బాగా చేస్తానని, దాన్ని తినాలనే ఆశతో వస్తారు. ‘ఆంటీ వండినవి మాకూ పంపించరూ!’ అని అడుగుతారు. మా ఆఫీస్‌లోనూ.. ‘మీ చేతి వంటలు తేవొచ్చు కదా!’ అని అడుగుతారు. ఇలా నా సమయం, ఆలోచన, అభిమానం, గుర్తింపు అన్నీ వంటలే!
బ్యాచ్‌లర్స్‌కి, వర్కింగ్ ఉమెన్‌కి, విదేశాల్లో ఉండేవాళ్లకు ఉపయోగపడే వంటలే నా ఛానల్లో ఎక్కువగా ఉన్నాయి. రెడీ మిక్స్ వంటకాలు ఎక్కువగా చేశాను. పట్టణాల్లో, విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్లకు మన వంటకాలు చేసుకోవడానికి సమయమేకాదు.. కావాల్సిన పదార్థాలన్నీ అందుబాటులో ఉండవు. కాబట్టి కష్టం. ఇలాంటి వారి కోసం రెడీమిక్స్ తయారు చేశాను. కిచిడీ, దోశా, ఇడ్లీ, పల్లీ చట్నీ, సాంబార్.. ఇలా మరెన్నో వంటకాల రెడీమిక్స్ని ఎలా చేసుకోవాలో వీడియోలు చేశాను. వీటికి విపరీతమైన ఆదరణ వచ్చింది. నా ఛానెల్ పాపులర్ కావడానికి ఇన్స్టంట్ వంటకాలే కారణం. ఇడ్లీ పిండి మిగిలిపోతే ఏం చేయాలి? చపాతీ పిండి మిగిలితే ఎలా ఉపయోగించుకోవాలి? ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపట్ల అవగాహన పెరిగింది. డ్రైఫ్రూట్స్‌తో లడ్డూలు, నువ్వుల పచ్చడి, నువ్వుల చారు.. ఇలాంటి వాటికి ఎక్కువ ఆదరణ ఉంది. రుచుల కంటే పోషకాలు అధికంగా అందించే వంటలను ఆదరిస్తున్నారు. నాకు ఇన్స్టంట్ రెసిపీస్ చాలా ఇంట్రెస్ట్. నాలాంటి వర్కింగ్ ఉమెన్‌కి అవి ఎంతో ఉపయోగం. ఇప్పుడు అందరూ మిల్లెట్స్ తింటామని అంటున్నారు. మిల్లెట్స్ ఇన్స్టంట్స్ రిసిపీస్ తయారు చేద్దామనుకున్నాను. ఆ సందర్భంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లో ‘మిల్లెట్ మాన్యుఫాక్చరింగ్’ కోర్స్ చేశాను. మిల్లెట్ రెడీమిక్స్ చేస్తూనే ‘హోల్సమ్’ కంపెనీ ప్రారంభించాను. తెలంగాణ, అరకులో మిల్లెట్స్ సాగు పద్ధతులు తెలుసుకున్నాను. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన మిల్లెట్స్, పప్పులు, మసాల దినుసులు, గానుగ నూనెలు ఆన్లైన్లో అమ్ముతున్నాను. ఎప్పుడంటే అప్పుడు మిల్లెట్స్‌తో దోశ, పొంగల్, ఇడ్లీ చేసుకునేలా ఇన్స్టంట్ రెడీమిక్స్ తయారు చేశాను. జొన్నలతో పాస్తా, నూడుల్స్, సేమియాలు తయారు చేశాను. ఇక మైదాతో అవసరమే లేదు. వీటిని ఎలా వండుకోవాలో చెబుతూ వీడియోలు చేశాను. ఇ-కుక్‌బుక్ రాశాను. ఈ డిజిటల్ బుక్ హైదరాబాద్ రుచులు వెబ్ సైట్లో అందరికీ అందుబాటులో ఉంది.
ఇండియాలో ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి విదేశీయులకు ఆసక్తి ఉంటుంది. అలాంటి పర్యాటకులు మా ఇంటికి వస్తారు. చపాతీ, బిర్యానీ, రోజువారీ వంటలు చేసుకోవడం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటి పర్యాటకులు టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో మా ఇంటిని సందర్శిస్తారు. మా ఇంట్లో ఒక పూట ఉండి పోతారు. నెలలో రెండు, మూడుసార్లు ఇలా వస్తుంటారు. వాళ్లతో మన వంటలు చేయిస్తాం. ఇలా వంటలు నేర్పడం, మరచిపోయిన వంటకాలను గుర్తు చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఇంత పాపులర్ అయ్యాను. యూట్యూబ్‌లో ఒక మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లక్షల మంది ఫాలోయింగ్ ఉంది. ఇంతమంది ఆదరణ, అభిమానం వల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి అవార్డులు అందుకున్నాను.
– నాగవర్ధన్ రాయల