హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ మొదలు జేఎన్టీయూ వరకు అన్ని యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య కొరవడుతున్నది. పరిశోధనలు పడకేస్తున్నాయి. వర్సిటీల్లో భారీగా ఖాళీలు పేరుకుపోవడమే అందుకు కారణం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి కీలక పోస్టులతోపాటు డిపార్ట్మెంట్లవారీగా టీచింగ్ పోస్టులు తప్పకుండా భర్తీ చేయాలి. కానీ అన్ని యూనివర్సిటీలు యూజీసీ మార్గదర్శకాలను విస్మరిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్ సర్కార్‌నే దోషి అంటూ.. పలు వర్సీటీల వైస్ చాన్స్లర్లు, మాజీ వైస్ చాన్స్లర్లు, సీనియర్ ప్రొఫెసర్లు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీలకు ఆయువుపైట్టెన అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదు. పరిశోధనలు చేసే విద్యార్థులకు సబ్జెక్టులవారీగా గైడ్ల(సీనియర్ ప్రొఫెసర్ల) కొరత తీవ్రంగా ఉంది. దీంతో పరిశోధనలు ముందుకు సాగడం లేదు. మరోపక్క వర్సిటీల అభివృద్ధి కోసం నిధులు ఇస్తామన్న హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని అధికారులతోపాటు విద్యార్థి, అధ్యాపక సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సీం రేవంత్ ఇస్తానన్న రూ.1,000 కోట్లల్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు అని, పైగా ఆయా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కింద ఉన్న నిధులను సర్కార్ కాజేయాలని చూస్తుందని వాపోతున్నారు. సంబంధించిన నిధులు ఎన్ని ఉన్నాయో? ఆ లెక్క చెప్పాలని సర్కార్ వీసీలను ఆదేశించినట్టు సమాచారం.
11 యూనివర్సిటీల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 2,878 పోస్టులు మంజూరు చేశారు. వాటిలో 753 పోస్టుల్లో అధ్యాపకులను నియమించగా, దాదాపు 2,125పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కాంట్రాక్ట్, గెస్టు, పార్టుటైమ్ అధ్యాపకులతోనే విద్యాబోధన చేపడుతున్నారు. ఓయూలోనే ఖాళీలు అధికంగా ఉన్నాయి . ఈ వర్సిటీలో ప్రస్తుతం 936 పోస్టులు ఖాళీగా ఉంటే, కాకతీయలో 332, జేఎన్టీయూలో 266, ఆర్జీయూకేటీలో 127, పాలమూరులో 117 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యాబోధన కుంటుపడుతున్నదని అధ్యాపకులు, విద్యార్థులు వాపోతున్నారు.