మంచు కొండల్లో విహారం.. మహాద్భుతంగా సాగుతుంది. అందుకే, శీతాకాలం మంచు కురిసేవేళలో.. హిమాలయాల సందర్శన అధికం అవుతుంది. అయితే, కొందరికి చలికాలంలో మంచు పర్వతాలకు వెళ్లడం తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అలాంటివారికి ‘మార్చి’ నెల మరో అవకాశం ఇస్తుంది. వింటర్ వెళ్లిపోయినా.. మార్చిలో మంచుకురిసే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడి పర్వత శిఖరాలు ఇప్పటికీ శీతాకాలపు కిరీటాలను ధరించే దర్శనమిస్తాయి.
భూతల స్వర్గంగా పేరుగాంచిన గుల్మార్గ్.. అద్భుతమైన పర్యాటక కేంద్రం. గుల్మార్గ్ అంటే.. ‘పూల దారి’ అని అర్థం. వసంతంలో ఈ ప్రాంతం రంగురంగుల పూలతో కంటికి విందు చేస్తుంది. ఇక మార్చిలోనూ మంచు దుప్పటి కప్పుకొని ఒయ్యారాలు పోతుంది. ఎలాంటి అనారోగ్యం కలగకుండా.. మంచులో సందడి చేయాలని అనుకునేవారికి ఇది చక్కని గమ్యస్థానం. వేసవికి ముందే ఇక్కడ వాలిపోతే అద్భుతమైన అనుభూతుల్ని మూటగట్టుకోవచ్చు. మంచుతోపాటు ఇక్కడి విశేషాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే రెండవ ఎత్తయిన కేబుల్ కార్ ప్రయాణం.. ఇక్కడే ఉంది. గుల్మార్గ్ గొండోలాలో ప్రయాణిస్తూ.. మంచు పర్వతాల అందాలను వీక్షించవచ్చు. ఇక స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్లెడ్జింగ్ వంటి సాహస క్రీడలకూ ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఖిలన్ మార్గ్, ఆల్పాథర్ సరస్సు, డోగ్రా పాలకులు నిర్మించిన శివాలయం, బ్రిటీష్ కాలం నాటి సెయింట్ మేరీ చర్చి.. తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతాలు.
ప్రకృతి ప్రేమికులతోపాటు సాహస యాత్రికులకూ స్పితి లోయ ఓ కలల ప్రపంచం. సముద్ర మట్టానికి 12,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని ‘కోల్డ్ డెసర్ట్’ అనికూడా పిలుస్తారు. మార్చిలోనూ మంచు దుప్పటి కప్పుకొనే కనిపించే స్పితి వ్యాలీలో.. అడుగడుగునా టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే.. మంచులో మునిగిపోవడంతోపాటు వందల ఏళ్ల నాటి పురాతన మఠాలను కూడా సందర్శించవచ్చు. స్పితి లోయలోనే అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ బౌద్ధ మఠం.. కీ మొనాస్టరీ. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ మఠం.. చూసేందుకు కోటలా కనిపిస్తుంది. ఇక్కడి కిబ్బర్, కోమిక్ గ్రామాలు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నివసించే ప్రాంతాలుగా పేరుగాంచాయి. చంద్రతాల్ సరస్సు, ధంకర్ మఠం, ‘హిమాలయాల అజంతా’గా పిలుచుకునే టాబో మోంటిస్సోరిని కూడా చూసి తీరాల్సిందే!
ఇండియన్ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన ఔలి.. స్కీయింగ్ ప్రేమికులకు స్వర్గధామమే! ఇక్కడ స్కీయింగ్ చేయడానికి ప్రపంచ నలుమూలల నుంచి ఔత్సాహికులు ఔలిలో వాలిపోతారు. సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం.. అద్భుతమైన హిమాలయ దృశ్యాలకు నిలయం కూడా. ఆసియాలోనే పొడవైన కేబుల్ కార్‌ను ఇక్కడ చూడొచ్చు. జోషీమఠ్ నుండి ఔలి వరకు ఉన్న కేబుల్ కార్ ప్రయాణం.. సుమారు 4 కిలోమీటర్లు సాగుతుంది. కేబుల్ కార్లో ప్రయాణిస్తూ, మంచు కొండల అందాలను ఆస్వాదించడం.. మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. దాంతోపాటు ఔలి సరస్సు, గుర్సో బుగ్యాల్, ఛత్రాకుండ్, జోషీమఠ్‌ను కూడా సందర్శించొచ్చు.