కట్టంగూర్, జూలై 31 : ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో రైతు పొలాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు పంటల మార్పిడి ద్వారా భూమి సారం పెరుగుతుందని తెలిపారు. చీడపీడల ఉధృతి తగ్గి, తక్కువ పెట్టుబడితో అధిక నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులతో మాట్లాడి వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ వ్యవసాయ సహాయ సంచాలకులు టి.విజయేందర్ రెడ్డి, ఏఓ వై.గిరిప్రసాద్, ఏఈఓలు నవీన్ కుమార్, రమ్య పాల్గొన్నారు.