E20 petrol : ఇథనాల్ (ఈ20) పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాహనదారులు ఈ20 పెట్రోల్‌ను వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంటూ వస్తోంది. తాజాగా ఈ20 పెట్రోల్ వినియోగం వల్ల మేలు జరిగిందంటూ కేంద్రం చెబుతోంది. ఈ20 పెట్రోల్‌పై రాజ్యసభలో కేంద్రం తాజాగా కొన్ని వివరాల్ని వెల్లడించింది. ఇరాన్ యుద్ధం సమయంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ సమయంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపకుంటే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర రూ.125 అయ్యేదని కేంద్రం తెలిపింది.
ఇథనాల్ కలపడం వల్ల విదేశాల నుంచి పెట్రోల్ (చమురు) దిగుమతి తగ్గిందని, అలాగే సాధారణ ప్రజలకు పెట్రోల్ ధరల భారం కూడా తగ్గిందని కేంద్రం వివరించింది. పశ్చిమాసియా యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. బ్రెంట్ బ్యారెల్ క్రూడాయిల్ ధర 135 డాలర్లకు చేరింది. ఈ సమయంలో లెక్క ప్రకారం ఇండియాలో పెట్రోల్ లీటర్ ధర రూ.125కు చేరాలి. కానీ, కేంద్రం అమలు చేస్తున్న ఇథనాల్ పాలసీ వల్ల, చమురు కొనుగోలులో కంపెనీలు అనుసరించిన వ్యూహాల వల్ల పెట్రోల్ ధరలు రూ.94.77 వరకే ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో ఉత్పత్తి అయిన ఇథనాల్‌ను పెట్రోల్‌లో 20 శాతం కలపడం వల్ల పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. సామాన్యుడికి ప్రతి లీటర్‌కు రూ.30 వరకు మిగిలాయని చెబుతోంది. అది కూడా చమురు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఈ ధరలున్నాయని కేంద్రం చెప్పింది.
ఇథనాల్ కలిపే ఉద్దేశం దేశ ప్రజలకు తక్కువ ధరకు చమురు ఇవ్వడం కాదని, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావం కనిపించకుండా ఉండటానికి, భారత చమురు రంగానికి భద్రత కల్పించానికి అని కేంద్రం వివరించింది. భారత నిధుల్ని చమురు కోసం విదేశాలకు చెల్లించకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కూడా దీని లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయని జరుగుతున్న ప్రచారంపై కూడా కేంద్రం స్పందించింది. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. ఇప్పటికే వివిధ సంస్థలు, వాహనాల తయారీదారులతో కలిసి ఈ విషయంపై పరీక్షలు నిర్వహించామని కేంద్రం తెలిపింది. తమ పరీక్షల్లో వాహనాల సామర్ధ్యం దెబ్బతిన్నట్లు, పనితీరు తగ్గినట్లు ఏమీ తేలలేదని కేంద్రం వెల్లడించింది.