చెన్నై: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్‌ను తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. (New Pension Scheme) ‘తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్’ ద్వారా పాత పెన్షన్ పథకం ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకునే జీతంలో యాభై శాతం అష్యూర్డ్ పెన్షన్ వారికి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల 10 శాతం సహకారంతో పాటు పెన్షన్ నిధికి అవసరమైన మొత్తం అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు.
కాగా, 50 శాతం అష్యూర్డ్ పెన్షన్ పొందే పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని కూడా పెంచుతామని సీఎం ఎంకే స్టాలిన్ భరోసా ఇచ్చారు. ఒకవేళ పెన్షనర్ మరణించినట్లయితే పెన్షన్ మొత్తంలో 60 శాతం మరణించిన వ్యక్తి నామినీకి కుటుంబ పెన్షన్‌గా మంజూరు చేస్తామని చెప్పారు.
మరోవైపు కొత్త పెన్షన్ పథకం ఇతర ప్రయోజనాలను సీఎం స్టాలిన్ వివరించారు. ఉద్యోగంలో ఉండగా లేదా పదవీ విరమణ సమయంలో మరణిస్తే సర్వీస్ ఆధారంగా గరిష్టంగా రూ. 25 లక్షల వరకు డెత్ గ్రాట్యుటీ అందుతుందని తెలిపారు. కొత్త పెన్షన్ పొందడానికి అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ వ్యవధి పూర్తి చేయకుండా పదవీ విరమణ చేసినప్పటికీ కనీస పెన్షన్ అందిస్తామని చెప్పారు.
కాగా, కొత్త పెన్షన్ పథకం కోసం పెన్షన్ నిధికి అదనంగా రూ. 13,000 కోట్లు ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కొత్త పెన్షన్ పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read:
Trinamool MP Mausam Noor | తృణమూల్‌కు ఎంపీ మౌసమ్ నూర్ గుడ్ బై.. కాంగ్రెస్‌లో చేరిక
Cross-Border Kidney Racket | రైతు వీడియో వైరల్.. సరిహద్దులు దాటిన కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్