వికారాబాద్, మార్చి 2, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్‌లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు సోమవారం లోక్‌సభ పక్షనేత రాహుల్‌గాంధీ వచ్చిన సందర్భంగా పోలీసులు అడగడుగునా ఆంక్షలు విధించారు. జిల్లా కేంద్రంతోపాటు తాండూర్వైపు వెళ్లే వాహనాలను ఎక్కడిక్కడ నిలిపివేసి దారి మళ్లించారు. శ్రీఅనంతపద్మనాభస్వామి కాలేజీలో పరీక్ష కేంద్రానికి వెళ్లే ఇంటర్ విద్యార్థులను పోలీసులు ఇబ్బందులు పెట్టడంపై తల్లిదండ్రులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్తోపాటు ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఓ ప్రకటనలో విమర్శించారు. లగచర్ల గిరిజన రైతులను బెదిరించి జైల్లో పెట్టినప్పుడు రాహుల్‌గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బుల్డోజర్లు పేదల జీవితాలను నాశనం చేస్తున్నప్పుడు తెలంగాణ గుర్తు రాలేదని, మెస్సీ ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తిలకించేందుకు, డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు సమయం దొరికిందని ఎద్దేవాచేశారు.
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ-ఏపీ డీసీసీ అధ్యక్షుల 10 రోజుల శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. లోక్‌సభ పక్షనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్ దిశానిర్దేశం చేశారు. శిక్షణ తరగతుల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేజీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఉండగానే డీజే పాటలకు డ్యాన్స్ చేయడంపై శిక్షణ తరగతులా? రికార్డింగ్ డ్యాన్స్‌లా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.