ముంబై: అప్పులపాలైన రైతు విదేశాల్లో కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే కిడ్నీ గ్రహితల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని తనకు తక్కువ ఇచ్చినట్లు ఒక వీడియోలో ఆయన ఆరోపించాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. సరిహద్దులు దాటిన కిడ్నీ రాకెట్ గుట్టును రట్టు చేశారు. (Cross-Border Kidney Racket) మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు రోషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. సోషల్ మీడియా ద్వారా ‘కిడ్నీ డోనర్ కమ్యూనిటీ’ గురించి తెలుసుకున్నాడు. గత నెలలో ఒక ఏజెంట్‌ను సంప్రదించాడు. కంబోడియా వెళ్లిన ఆ రైతు తన కిడ్నీని రూ.8 లక్షలకు అమ్ముకున్నాడు. ఆ తర్వాత తాను కిడ్నీ అమ్మిన విషయాన్ని ఒక వీడియోలో పేర్కొన్నాడు. భారత్ నుంచి కంబోడియా వరకు కిడ్నీ రాకెట్ ఎలా పనిచేస్తుందో అన్నది అందులో వివరించాడు.
కాగా, రైతు రోషన్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా విస్తరించిన కిడ్నీ రాకెట్ నెట్వర్క్ సరిహద్దులు దాటి పనిచేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఉన్నతస్థాయి డాక్టర్లు అక్రమంగా కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
మరోవైపు తమిళనాడు తిరుచ్చిలోని స్టార్ కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రాజరత్నం గోవిందస్వామి, ఢిల్లీకి చెందిన డాక్టర్ రవీందర్ పాల్ సింగ్‌తోపాటు ఏజెంట్ రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి కోసం గ్రహీతల నుంచి రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు వసూలు చేసి, కిడ్నీ అమ్ముకునే పేదలకు రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు చెలిస్తున్నారని పోలీస్ అధికారి ఆరోపించారు. సరిహద్దులు దాటిన ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Pregnant Woman Walks 6 km | ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణీ.. పరిస్థితి విషమించి మృతి