కరాచీ: టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశను కూడా దాటని తమ జట్టు ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలకు ఉపక్రమించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. గత కొద్దికాలంగా ప్రధాన టోర్నీల్లో దారుణంగా విఫలమవుతున్న ఆ జట్టు ఆటగాళ్లపై ఒక్కొక్కరికి రూ. 16 లక్షల చొప్పున జరిమానా విధించనున్నట్టు తెలుస్తున్నది. పొట్టి ప్రపంచకప్లో దాయాది భారత్తో పాటు సూపర్-8లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన పాక్.. తమ చివరి మ్యాచ్లో శ్రీలంకనూ తక్కువ స్కోరుకు కట్టడిచేయలేక సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. దీనిపై ఇప్పటికే పీసీబీ చీప్ మోహ్సిన్ నఖ్వీ నుంచి ఆదేశాలు వచ్చాయని, త్వరలోనే క్రికెటర్లపై జరిమానా విధించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. పాక్ సారథి సల్మాన్ అలీ అఘాపైనా వేటు పడే అవకాశమున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.