Hajj Pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వందల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు వెయ్యి మంది ఈ యాత్రలో మృత్యువాతపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. ఈ యాత్రలో 90 మంది భారతీయులు కూడా (Indian pilgrims) మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (External Affairs Ministry) తాజాగా స్పందించింది.
హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం ప్రకటించింది. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. సహజ కారణాల వల్లే ఈ మరణాలు నమోదైనట్లు పేర్కొంది. ‘ఏటా చాలా మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీని సందర్శించారు. అందులో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారు’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్ యాత్రికులు (Hajj Pilgrims) అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడికి యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. దాదాపు 10 దేశాలకు చెందిన 1,081 మంది యాత్రికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. మరో రెండు లక్షల మంది సౌదీ అరేబియా వాసులుగా పేర్కొన్నారు.
Also Read..
Melinda Gates | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ఆ నేతకే : మిలిందా గేట్స్