Iran war : గల్ఫ్ దేశాల చమురు నిల్వ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే యూఏఈ, ఖతార్‌లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడులు చేసిన ఇరాన్ తాజాగా సౌదీ అరేబియాలోని ప్రధాన పట్టణం యన్బులోని రెడ్ సీ పోర్టు వద్ద గల సౌదీ అరాంకో సంస్థకు చెందిన చమురు రిఫైనరీలపై దాడి చేసింది. అయితే, ఈ దాడిలో భారీ నష్టమేమీ కలగలేదని అరాంకో సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై దాడికి దిగుతోంది.
ముఖ్యంగా అక్కడి చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలు లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ రిఫైనరీ గ్యాస్) రిఫైనరీ ప్లాంట్ అయిన రస్ లఫ్ఫాన్పై దాడి చేసింది. దీంతో ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసుకుపోయి చమురు రవాణా స్తంభించిన నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్‌లోని చమురు కేంద్రాలపై దాడులు జరగడం ప్రపంచాన్ని మరింత కలవరపెడుతోంది. ముఖ్యంగా గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతే అనేక దేశాలు ఇంకా సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఇప్పటికే సరైన చమురు సరఫరా లేకపోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరింది. ఇప్పుడు గల్ఫ్ కేంద్రాలపై దాడులు, అక్కడ చమురు ఉత్పత్తి నిలిచిపోతే ఆయిల్ సరఫరాకు ఇంకా ఇబ్బంది కలుగుతుంది.
ఇండియాపైన కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం 50 శాతం చమురును అంతర్జాతీయ మార్కెట్ల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ఖతార్ నుంచి 20 శాతం ఎల్ఎన్జీని కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది అక్కడి నుంచి ఉత్పత్తి, రవాణా తగ్గిపోతే ఇండియాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి, విద్యుత్ ఉత్పత్తికి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రస్తుతం ఇండియా ప్రతిరోజూ 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూమిక్ మీటర్స్ (ఎంఎంఎస్‌సీఎండీ) పర్ డే వినియోగిస్తోంది. ఇందులో 97.5 ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే ఇండియాలో ఉత్పత్తి అవుతోంది.