ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చివరి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గృహప్రవేశాలు పూర్తయినా ఆఖరి లక్ష కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రం దయతలిస్తేనే చివరి బిల్లులు వస్తాయని అధికారులు చెప్తుండగా కాంగ్రెస్ సర్కార్ తీరుపై లబ్ధిదారులు అసహనానికి లోనవుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చివరి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గృహప్రవేశాలు పూర్తయినా ఆఖరి లక్ష కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే చివరి బిల్లు వస్తుందని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ సర్కార్ తీరుపై లబ్ధిదారులు అసహనానికి లోనవుతున్నారు.
ఇంటి స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 4,50,000 ఇండ్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం బడ్జెట్లో రూ.22వేల కోట్లు కేటాయించింది. ఫస్ట్ ఫేజ్లో 3,24,536 ఇండ్లు మంజూరు చేయగా, ఇందులో 2.74లక్షలు గ్రౌండింగ్ చేశారు. ఆగస్టు చివరి నాటికి 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, 1.12 లక్షల కుటుంబాలు గృహప్రవేశాలు కూడా చేశాయని అధికారులు తెలిపారు. 2,62,449 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. అయితే కేవలం మూడు విడుతలకు సంబంధించి రూ.4లక్షల చొప్పున సుమారు రూ.6వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు.
కొందరికి మాత్రం మూడో విడుత కింద కేంద్రం అందించే రూ.60వేలు కూడా అందలేదని తెలుస్తున్నది. గృహప్రవేశం చేసిన వారు చివరి బిల్లు కోసం ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నారు. పథకం ప్రారంభమై రెండేండ్లు దాటినా ప్రభుత్వం మొదటి విడుతలో లక్ష్యం మేరకు ఇండ్ల మంజూరు చేయలేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఐదేండ్లలో 20లక్షల ఇండ్లు కట్టిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో లక్ష అందజేస్తామని చెప్పింది. స్థలాలు లేని నిరుపేదలకు సర్కారే కొనుగోలు చేసి ఇల్లు మంజూరు చేస్తుందని ఊదరగొట్టింది. 2024 మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. పునాది వేసిన వెంటనే మొదటి విడుత కింద లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రెండో విడుత కింద లక్ష, స్లాబ్ వేసిన తర్వాత మూడో విడుత కింద రూ.2లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత చివరి లక్ష ఇస్తామని ప్రకటించింది. అయితే రెండో విడుత కింద కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.72వేలు అందజేస్తుంది.
ఇందులో వీబీ జీ రామ్జీ(ఉపాధి పథకం) ద్వారా రూ.27,600, స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12వేలు, పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద రూ.21వేలు.. ఇలా కేంద్రం ఇచ్చే రూ.72వేలను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చారు. చివరి బిల్లులను కేంద్రం అందించిన నిధులతో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్రం దయతలిస్తేనే నాలుగో విడుత బిల్లు అందే అవకాశమున్నది.
మరి కేంద్రం విడుదల చేయకుంటే పరిస్థితి ఏంది? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్న తమను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంతో మెలిక పెట్టకుండా వెంటనే చివరి విడుతకు సంబంధించిన లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.