రవీంద్రభారతి/హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను ఎత్తివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ చౌరస్తాలోని డీఈవో కార్యాలయం నుంచి సెక్రటేరియట్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.
బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, విద్యార్థులకు తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ.8.500 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో 50% సీట్లు కూడా భర్తీకాలేదని విమర్శించారు. విద్యార్థుల చదువులకు బడ్జెట్ లేదని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏమీ అభివృద్ధి చేశారో.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసుల చేత దౌర్జన్యం చేయించడంపై మండిపడ్డారు. తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు పాత పద్ధతిలో విడుదల చేసే వరకు తెలంగాణ తరహాలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.