విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా, దాదాపు 55% మంది విద్యార్థులకు ఒక్క జత డ్రెస్‌లు కూడా అందలేదు. రాష్ట్రంలో 18.36 లక్షల మంది విద్యార్థులకు ఒక జత
యూనిఫామ్ అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 8.13 లక్షలు (44.30%) మందికే అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి జిల్లాల్లో ఒక్క విద్యార్థికీ యూనిఫామ్ అందకపోవడంతో పాత దుస్తులతోనే క్లాసులకు వెళ్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కార్ బడుల్లోని విద్యార్థులకు అందించే ఉచిత యూనిఫామ్‌ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా, దాదాపు 55% మంది విద్యార్థులకు ఒక్క జత డ్రెస్‌లు కూడా అందలేదు. రాష్ట్రంలో 18.36 లక్షల మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ అందజేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 8.13 లక్షలు (44.30%) మందికే ఒక జత అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి జిల్లాల్లో ఒక్క విద్యార్థికి కూడా అసలు యూనిఫామ్ అందలేదు. దీంతో విద్యార్థులు పాత యూనిఫామ్‌తో క్లాసులకు హాజరవుతున్నారు.
గతంలో మొదటిరోజునే..
గతంలో విద్యార్థులకు విద్యాసంవత్సరం మొదటి రోజునే యూనిఫామ్‌లు అందేవి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే ఒక జత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందించారు. అయితే, ఈసారి యూనిఫామ్ సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. గతంలో తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) నుంచి నేరుగా యూనిఫామ్ వస్త్రాన్ని కొనుగోలు చేసేవారు. అయితే, ఈసారి స్కూల్ కిట్ పేరిట గురుకులాలు, స్కూళ్ల సామగ్రి సేకరణకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. ఇదే జాప్యానికి కారణంగా తెలుస్తున్నది. వస్త్రం ఆలస్యంగా అందిన కారణంగా ఈ నెల 1వ తేదీలోగా ఒక జత యూనిఫామ్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ గడువు ముగిసి రెండు వారాలు దాటినా ఇంకా 55% మందికి అందకపోవడం గమనార్హం.
షూస్, సాక్స్, బెల్టుల సరఫరాలోనూ జాప్యం
యూనిఫామ్‌తోపాటు విద్యార్థులకు అందజేయాల్సిన షూస్, సాక్స్, బెల్టుల సరఫరాలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటివరకు వరకు హనుమకొండ, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక జత షూస్ కూడా అందలేదు. అదేవిధంగా 18 జిల్లాల్లో సాక్స్, 22 జిల్లాల్లో బెల్టులు సరఫరా కాలేదు.
నాణ్యతపైనా ఫిర్యాదులు
ఇప్పటికే యూనిఫామ్‌లు అందిన కొన్ని పాఠశాలల్లో వాటి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. వస్త్రం నాణ్యత తక్కువగా ఉన్నదని విద్యార్థులు, టీచర్లు చెప్తున్నారు. షర్ట్ వస్త్రం పలుచగా, నాణ్యత తకువగా ఉండటంతోపాటు రంగు కూడా వెలవెలబోయిందని ఓ ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. కుట్లు ఊడిపోతున్నాయని కొందరు టీచర్లు చెప్తున్నారు. బాలికలు ధరించేందుకు అదనపు లైనింగ్ అవసరమయ్యేలా వస్త్రం ఇవ్వాల్సి ఉండెనని మరో టీచర్ అభిప్రాయపడ్డారు. బాలుర షర్ట్ కాలర్లు సరైన ఆకారంలో లేవని అంటున్నారు.