సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): గత కొన్ని రోజులుగా గ్రేటర్లో కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు క్యూ కడుతున్నారు. దీనికి తోడు కొన్ని చోట్ల కరోనా కేసులు కూడా నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే సీజనల్ లక్షణాలు, కరోనా లక్షణాలు ఒకే విధంగా ఉండడంతో ఏది కరోనానో, ఏది సీజనలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ప్రైవేటు దవాఖానలు, క్లీనిక్స్‌ల్లో అయితే లక్షణాల ఆధారంగా వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా చాలా మంది పిల్లలు, యువకుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు కొందరు వైద్యలు చెబుతున్నారు. లక్షణాల ఆధారంగా ప్రైవేటు వైద్యలు కరోనా పరీక్షలు చేయించుకోమని రోగులకు సూచిస్తున్నారు.
చేసేది లేక..
జలుబు, ఆయసం, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలతో బాధపడే వారికి ప్రైవేటు దవాఖానలు, క్లినిక్స్‌లలో వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో రోగులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయిస్తే తమ వద్ద కరోనా కిట్స్ లేవని, తాము కరోనాకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు చేయడం లేదని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో చేసేది లేక అనుమానిత లక్షణాలు గల రోగులు కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు తీయాల్సి వస్తున్నది.
కరోనాపై స్పష్టత ఇవ్వని అధికారులు
గ్రేటర్లో కరోనా కేసులు నమోదవుతున్నాయంటూ ప్రైవేటు దవాఖానలు, క్లినిక్‌లకు చెందిన వైద్యులు చెబుతుంటే ప్రభుత్వ దవాఖానల అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం కరోనా కేసులపై నోరు మెదపడం లేదు. తెలంగాణలో కరోనా కేసులు నమోదు కావడం లేదని వారు చెబుతుండగా, అసలు పరీక్షలు చేస్తే కదా కేసులు నమోదవుతున్నాయో లేదో తెలిసేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు ల్యాబ్‌లలో నమోదవుతున్న కరోనా కేసుల వివరాలను సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు చేరవేయాల్సి ఉండగా సదరు ల్యాబ్‌ల నిర్వాహకులు మాత్రం ఆ వివరాలను వైద్య,ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం విచారకరం.