రైస్ మిల్లుల్లో ధాన్యం గాయబ్ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు.. కోట్లాది రూపాయల విలువ చేసే వడ్లు పక్కదారి పట్టినట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాలోని కేవలం నాలుగు మిల్లులోనే రూ.135 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు అధికారులు తేల్చగా, మిగతా 196 మిల్లుల్లోని రూ.1800 కోట్ల విలువైన వడ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందులో ఇప్పటికే యాభై శాతం వరకు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగిత్యాల, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : 2022-23 సంవత్సరానికి సంబంధించిన టెండర్ ప్యాడీ డబ్బులు ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో వడ్ల నిల్వలు రైస్‌మిల్లుల్లో ఉన్నాయా.. లేవా..? అని పరిశీలించేందుకు రాష్ట్ర విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామ శివారులో ఉన్న మూడు రైస్‌మిల్లులపై ఆకస్మిక దాడులు చేసి, పక్కదారి పట్టిన ధాన్యం వివరాలను చూసి బిత్తరపోయారు. టెండర్ ప్యాడీకి సంబంధించిన ధాన్యం నిల్వలతోపాటు ఆ తర్వాత సీజన్లలో ఇచ్చిన ధాన్యం సైతం పెద్ద మొత్తంలో లేదని గుర్తించి నివ్వెరపోయారు. 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మాయం అయిందని, దాని విలువ రూ. 87.89 కోట్లు ఉంటుందని ప్రకటించారు.
నాలుగైదు రోజుల తర్వాత మల్లాపూర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడికి చెందిన ఓ రైస్‌మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. 2022-23కు చెందిన రూ.27 కోట్ల టెండర్ ప్యాడీ డబ్బులు బకాయి పడిన నేపథ్యంలో సోదాలు చేశారు. అయితే టెండర్ అమౌంట్‌కు సంబంధించిన ధాన్యంతోపాటు ఆ తర్వాత మూడు సీజన్లలో ఇచ్చిన ధాన్యం సైతం పెద్ద మొత్తంలో పక్కదారి పట్టినట్టు గుర్తించారు. దాదాపు రూ.45 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు లేవని నివేదించారు. అధికారుల ఫిర్యాదుతో ఆయా మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు.
మిల్లుల్లోనే రూ.1800 కోట్ల విలువైన ధాన్యం
నాలుగు రైస్‌మిల్లులో రూ.135 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్టు తేలడంతో మిగిలిన మిల్లుల్లో ధాన్యం ఉన్నదా..? లేక మాయమైందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. 2024-25 యాసంగి, 2025-26 వానకాలం, 2025-26 యాసంగి సీజన్లకు సంబంధించి రూ.18 కోట్ల విలువైన ధాన్యం ఇంకా రైస్‌మిల్లర్ల ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తున్నది. 2024-205 యాసంగి సీజన్‌కు సంబంధించి 4,88,096 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలో ఉన్న రైస్‌మిల్లర్లకు అప్పగించారు. దీనికి గాను మూడు నెలల్లో ధాన్యాన్ని మర ఆడించి 3,16,826 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. అయితే ఆ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 2,40,179 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 76,646 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉన్నది.
అంటే ఇంకా రూ.271.32 కోట్ల విలువ చేసే 1.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రైస్‌మిల్లర్ల ఆధీనంలో నిల్వ ఉన్నది. 2025-26 వానకాలం సీజన్‌కు సంబంధించి 3,70,850 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను రైస్‌మిల్లర్లకు కేటాయించారు. దీనికిగాను సీఎంఆర్ కింద 2,49,031లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. అయితే ఇప్పటి వరకు కేవలం 76,188 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 1.72,842 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉన్నది. ఈ లెక్కన రూ.611.66 కోట్ల విలువ చేసే 2.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉన్నది. ఇక మే సీజన్‌కు సంబంధించి 5,44,213 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు అప్పగించారు. అందుకుగాను 3,65,838 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాలి.
అయితే ఇప్పటి వరకు 56,639 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 3,08,798 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. ఇంకా రూ.1,094 కోట్ల విలువైన 4,60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్‌మిల్లర్ల వద్దే ఉన్నది. మొత్తంగా మూడు సీజన్లకు కలిపి రైస్‌మిల్లర్లకు 13,83,159 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. దీనికి గాను రైస్‌మిల్లర్లు 9,31,295 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇప్పటి వరకు 3,73,006 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 5,58,286 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉన్నది. కాగా, ఇంకా రూ.1800 కోట్ల విలువ చేసే 8,31,000లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్‌మిల్లుల్లో నిలువ ఉండాలని అధికారులు చెబుతున్నారు.
రూ.100 కోట్ల వరకు టెండర్ ప్యాడీ బకాయిలు
మూడు సీజన్లకు కాకుండా 2022-23 సంవత్సరాలకు కేటాయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను సైతం మిల్లర్లు పెద్ద మొత్తంలోనే బకాయి పడ్డారు. 2022, 2023 సంవత్సరాల్లో పెద్ద మొత్తంగా దిగుబడి వచ్చిన నేపథ్యంలో అధికారులు సైతం మిల్లర్లకు పెద్ద ఎత్తున ధాన్యం కేటాయించారు. అయితే సీఎంఆర్ విషయంలో ఇబ్బందులు ఏర్పడగా.. ఆ తర్వాత వచ్చిన సర్కార్ మిల్లర్ల వద్ద నుంచి రావాల్సిన సీఎంఆర్ ప్యాడీకి టెండర్ నిర్వహించింది. ఈ సమయంలో రైస్‌మిల్లర్లు సీఎంఆర్ కింద తమ వద్ద ఉన్న ధాన్యం ఎంత విలువ ఉంటుందో అంత విలువను ప్రభుత్వానికి డబ్బు రూపంలో చెల్లిస్తామని, లేకుంటే ధాన్యరూపంలో ఇస్తామని చెప్పారు. కానీ, అటు డబ్బులు చెల్లించకుండా, ఇటు ధాన్యం ఇవ్వకుండా మొండికి వేశారు. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న రైస్‌మిల్లర్లు దాదాపు రూ.600 కోట్ల వరకు బకాయి పడ్డారు. మూడునాలుగు సీజన్లుగా అధికారులు ఈ బకాయిలను వసూలు చేస్తూనే ఉన్నారు. అయినా ఇంకా దాదాపు రూ.100 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు తెలిసింది.
నామమాత్రంగా తనిఖీలు!
రైస్‌మిల్లుల్లో అధికారుల తనిఖీలు, ప్రత్యేక తనిఖీలు, చివరకు విజిలెన్స్ తనిఖీలు సైతం తూతూ మంత్రమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు యంత్రాంగం, ఇటు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా రెండు సీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించే సమయంలో పౌర సరఫరాల శాఖ అధికారులు మిల్లుల్లో విధిగా తనిఖీలు చేయాలి. ముఖ్యంగా గత సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని పెట్టేందుకు మిల్లర్లు అదనపు గడవు కోరిన సమయంలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలి. అయితే అధికారులు చేసే తనిఖీ నామమాత్రంగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. మిల్లర్లతో కుమ్మక్కైయి, ధాన్యం నిల్వలు పరిశీలించకుండానే క్లియరెన్స్‌లు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇక విజిలెన్స్ అధికారులు తనిఖీ సమయాల్లో మిల్లర్లపై కేసులు నమోదు చేస్తున్నా.. పెద్దగా ప్రభావం చూపడం లేదు. కోట్ల రూపాయల వ్యాపారాలకు పడగెత్తిన మిల్లర్లు న్యాయస్థానాల నుంచి ముందస్తు బెయిల్స్ తెచ్చుకొని దర్జాగా దందాలు సాగిస్తూనే ఉన్నారు. కేసులు నమోదైన మిల్లలకు సైతం మళ్లీ సీజన్ రాగానే కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని కేటాయిస్తూనే వస్తున్నారు. అయితే ధాన్యం పక్కదారి, కోట్లాది రూపాయల ఎగవేత అంశాలపై కొందరు అధికారులు రహస్యంగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పాలసీ సరిగా లేదు. డిఫాల్టర్లకు వడ్లు కేటాయించవద్దు అని చెబుతారు. తీరా సీజన్ వచ్చాక కొనుగోలు చేసే ధాన్యంను మిల్లులకు పంపించాలని ఒత్తిడి పెడుతారు. డిఫాల్టర్ మిల్లులకు కేటాయించవద్దు అంటే జిల్లాలో కనీసం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించలేం. ఇప్పుడు ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలిస్తున్నాం.
మేమేం చేయగలం సార్’ అని వాపోతున్నారు. సీఎంఆర్‌కు సంబంధించి బియ్యం పెట్టడానికి సిద్ధంగా ఉన్న మిల్లర్లకు ప్రభుత్వం బెడ్స్‌ను కేటాయించలేకపోతున్నదని, చాలా ఆలస్యంగా కేటాయింపులు చేస్తున్నారని, బియ్యం తరలించే పరిస్థితి ఉండడం లేదని చెబుతున్నారు. ఇన్ని సమస్యలు ఉంటే మరోవైపు ప్రజాప్రతినిధులు ఫోన్లు చేసి డిఫాల్ట్ మిల్లర్లకు కేటాయింపులు చేయాలని ఆదేశాలు ఇస్తారని, తామేం చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సర్కారు సరైన పాలసీ తీసుకుంటే తప్పా, ధాన్యం స్కామ్‌లు ఆగవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటు వ్యాపారులు సైతం ‘సార్ వడ్లు పట్టించి బియ్యం పెడుతామంటే మాకు కేటాయింపులు చేయడం లేదు. బెడ్స్ ఇవ్వనిదే మేము ఏం చేయలేం. బియ్యం పట్టి పెడితే పదిహేను రోజుల్లో రంగుమారుతయి. వాటిని మళ్లీ సర్కారే తీసుకోదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందల కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి?
జిల్లావ్యాప్తంగా నాలుగు మిల్లుల్లో తనిఖీలు చేస్తేనే రూ.135 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్టు తేలితే.. మిగిలిన 196 మిల్లుల్లోని ధాన్యం పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోట్లాది రూపాయల ధాన్యం అసలు ఉన్నదా.. లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. మిల్లర్లు అంతర్గతంగా చెబుతున్న వివరాల ప్రకారం.. రూ.1800 కోట్ల విలువైన ధాన్యంలో దాదాపు యాభై శాతం వరకు మిల్లర్లు పక్కదారి పట్టించారని, సీఎంఆర్ పెట్టే సమయానికి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి పెట్టడం అలా కాకపోతే మరో మార్గాన్ని అన్వేషిస్తారని చెబుతున్నారు. కాదు, కూడదంటే సర్కారు నుంచి, లేదంటే న్యాయస్థానాల నుంచి సీఎంఆర్ బియ్యం పెట్టేందుకు గడువు పొంది టైమ్‌పాస్ చేస్తారని తెలుస్తున్నది.