ఐతారంగోల చాపలకని
అంగట్లకు పోయిన
రవులూ, బొమ్మలు, బొచ్చెలు
మొట్టలు మార్పులే కనిపిచ్చినయి…
మా సిన్నప్పుడు గివ్వే కావు
బుడ్డవర్కలు, కొడిపెలు, సందమామలు
జెల్లలు రొయ్యలు పాపెరకూనలు
గూండ్లోల్లు పొద్దుగాల్లనే
పట్టుకత్తుండ్రి…
చెంగ చెంగ ఎగురేటియే
తీస్కుంటుండే మా అవ్వ…
ఇప్పుడన్నీ అయిసుల పెడితే
కట్టెసరిసిన చాపలే…
నీళ్లు జల్లి మెత్తగ జేసి జోకిత్తున్నరు…
ఎసుంటి చాపలైనా మా అవ్వ
పొద్దూకి పులుసు వెడితే
తెల్లారి దినమంతా తింటుంటిమి…
కొడిపెలు సందమామలు
ఏలెడంత ఉన్నగాని
బోలెడంత రుచి ఉంటుండే…
మేం గాలాలేసి పట్టుకచ్చిన
మొట్టపిల్లలైతే ఎట్లైనా
మంచిగుంటుండే…
సెర్ల వలలేసి చాపలు పట్టుడు
పాటిచ్చి సూసేతందుకు
బడికి బాజాప్తా డుమ్మా గొట్టి
వయిలు కిందేసుకొని
కట్టమీద కూసున్న రోజులు యాదికత్తే
గప్పటి చాపల పులుసు
సయి సూసినంత గమ్మతనిపిత్తది…
అల్లాడి శ్రీనివాస్
8341663982