ఖైరతాబాద్ బడా గణేశ్‌ను చూసేందుకు ఆదివారం హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. 69 అడుగుల పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు బారులుదీరారు. గణనాథుడు కొలువుదీరిన నాటి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండగా, వారాంతం కావడంతో రద్దీ మరింత పెరిగింది. సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాతో ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఖైరతాబాద్ దారులన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. గణేశుడి దర్శనం కోసం 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. నిమజ్జనానికి సమయం సమీపిస్తుండటంతో రానున్న నాలుగు రోజులు భక్తుల రాక మరింత పెరిగే అవకాశమున్నదని ఉత్సవ కమిటీ భావిస్తున్నది.
– ఖైరతాబాద్