2023కు ముందు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు మాత్రమే ఉండేది. అయితే వారందరికీ ఇప్పుడు గొప్ప ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇటీవల ఇచ్చిన తీర్పే ఇందుకు కారణం. 2023 మే 24న లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షలదాకా పొడిగించిన విషయం తెలిసిందే. కానీ ఈ నిర్ణయం 2023 ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే అంతకంటే ముందు రిటైరై లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఆదాయం పొందినవారికీ వర్తిస్తుందని చెన్నై ఐటీఏటీ ఈ ఏడాది జూన్ 12న స్పష్టం చేసింది. దీంతో తాము పొందిన ఆదాయంపై రూ.3 లక్షల వరకే పన్ను మినహాయింపును అందుకున్నవారికి ఇప్పుడు భారీగా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతోపాటు, ప్రైవేట్ రంగ రిటైర్డ్ ఉద్యోగులకూ ప్రయోజనం అందగలదు. ముఖ్యంగా గతంలో రూ.3 లక్షలకు మించి ఆదాయం పొందినవారు ఇప్పటికే పన్నులు చెల్లించినా.. వారికీ లాభం చేకూరవచ్చని అంటున్నారు. కాగా, ఓఎన్జీసీ రిటైర్డ్ ఉద్యోగి వట్టికుండల ప్రభాకర రావు కేసులో ఐటీఏటీ ఈ తీర్పునిచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ పదవీ విరమణ పొందినప్పుడు ప్రభాకర రావుకు లీవ్ ఎన్క్యాష్మెంట్గా రూ.19.05 లక్షలు వచ్చాయి. 2020-21 మదింపు సంవత్సరానికిగాను దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో ఐటీ చట్టం 1961 కింద సెక్షన్ 10(10AA)(ii) అనుసరించి మొత్తం లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఆదాయానికి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేశారు.
ITAT Rulingఅయితే బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ పన్ను మినహాయింపును రూ.3 లక్షలకే వర్తింపజేసింది. మిగతా ఆదాయానికి పన్నులు వేసింది. దీనిపై ప్రభాకర రావు ఐటీ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. ఆ తర్వాత మూడేండ్లకు రూ.25 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర రావు ఐటీఏటీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ 1కి ముందూ ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై 100 శాతం పన్ను మినహాయింపు ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు మాత్రం దీన్ని మూడేండ్ల క్రితం రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది.