హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఆత్మగౌరవ భవన నిర్మాణం లో మున్నూరుకాపులంతా భాగస్వాములవ్వాలని ఎంకే ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కార్పొరేషన్ చైర్మన్ బొమ్మా శ్రీరామ్చక్రవర్తితో కలిసి హైదరాబాద్ కోకాపేటలో నిర్మిస్తున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
అంతకుముందు కోకాపేటలో సంఘం బాధ్యులతో సమావేశమయ్యారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. నిధుల సమీకరణకు ఆరుగురితో కమిటీ వేయాలని నిర్ణయించారు. పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. భవిష్యత్తరాల అవసరాలకు అనుగుణంగా సకల హంగులతో భవనాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గాలి అనిల్‌కుమార్, సీ విఠల్, రౌతు కనకయ్య, రమేశ్ హజారి, పన్నాల విష్ణువర్ధన్ బాలకిషన్, మీసాల చంద్రయ్య, ఏనుగుల రాజేందర్, గోపాల గణేశ్, దేపాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.