తెలంగాణ నేల ఎన్నో ఉద్యమాలకు, అనేక సాహిత్య ప్రవాహాలకు, అసంఖ్యాకమైన సృజనశీలులకు జన్మనిచ్చింది. తమ కాలంలో సాహిత్యరంగాన్ని ప్రభావితం చేసినప్పటికీ, కాలగమనంలో కొందరు రచయితల పేర్లు, రచనలు క్రమంగా పాఠకుల జ్ఞాపకం నుంచి దూరమయ్యాయి. అలాంటి అరుదైన సాహితీ వ్యక్తిత్వాల్లో దేవులపల్లి సుదర్శన్రావు ఒకరు.
సెప్టెంబర్ 18,1926న జన్మించిన సుదర్శన్రావు శతజయంతి సందర్భంగా ఆయన సాహిత్య ప్రస్థానాన్ని మరోసారి గుర్తుచేసుకోవడం ఒక విశిష్టమైన సందర్భం. ఇది ఒక సాహితీవేత్తను స్మరించుకోవడమే కాకుండా, తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒకప్పుడు వెలుగులు నింపినా..కాలగమనంలో కొంతమేరకు మరుగునపడిన ఒక అధ్యాయాన్ని మళ్లీ పాఠకుల ముందుకు తీసుకురావడం..
ఒక ఆత్మీయ పరిచయం నుంచి
మొదలైన అన్వేషణ ఈ వ్యాసం రాయడానికి ఒక ఆత్మీయమైన అనుబంధమే ప్రేరణగా నిలిచింది. దేవులపల్లి సుదర్శన్రావు కుమారుడు జ్ఞానేశ్వర్ నాకు సహోదర సమానమైన బంధువు. తన తండ్రి శతజయంతి సందర్భంగా ఆయన జీవితం, సాహిత్య సేవ, రచనలు, భాషా పాండిత్యం, అనువాద కృషి, సాహిత్య ప్రముఖులతో అనుబంధం వంటి అనేక విషయాలను నాతో పంచుకున్నారు. దేవులపల్లి సుదర్శన్రావు కేవలం ఒక కుటుంబానికి చెందిన సాహితీవేత్త మాత్రమే కాదని, తెలంగాణ సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని మరింత స్పష్టమైంది. ఆ అన్వేషణే ఈ వ్యాసానికి ప్రేరణ.
బొల్లికుంట నుంచి సాహిత్య ప్రపంచం వరకు..1926 సెప్టెంబర్ 18న జన్మించిన దేవులపల్లి సుదర్శన్రావు స్వగ్రామం హన్మకొండ తాలూకా, ఓరుగల్లు జిల్లాలోని బొల్లికుంట. వృత్తిరీత్యా కరణంగా, పట్వారీగా ఆయన పనిచేశారు. అయితే ఆయనకు ఉద్యోగం జీవనోపాధి అయితే, సాహిత్యం మాత్రం జీవన సాధనగా మారింది. తెలుగు, ఇంగ్ల్లిష్, ఉర్దూ భాషలపై పట్టు ఆయన సాహిత్య వ్యక్తిత్వానికి అరుదైన విస్తృతిని అందించింది. ఒక భాషలో రచించడం ఒక విశేషమైతే, మూడు భాషల సాహిత్య ప్రపంచాలను అర్థం చేసుకుని, వాటి మధ్య భావాలను అనుసంధానించడం మరింత విశిష్టమైన ప్రతిభ. సాహిత్యంపై అపారమైన మక్కువతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన రచనల్లో మేధో జిజ్ఞాస, తాత్విక అన్వేషణ, సహజమైన కవితా ప్రతిభ, మానవీయ విలువల పట్ల నిబద్ధత, సమాజాన్ని నిశితంగా పరిశీలించే దృష్టి స్పష్టంగా కనిపిస్తాయి. పాత వరంగల్ పత్రికా చరిత్రను పరిశీలించినప్పుడు, 1960ల్లో ఆయన ‘కాంగ్రెస్’ అనే పత్రికను వెలువరించినట్లు ప్రస్తావన కనిపిస్తున్నది. 1969లో వెలువడిన ‘తిరగబడు’ కవితా సంకలనంలో కూడా ఆయన పేరు కనిపిస్తుంది.
జీవితం, ఆకాంక్షలు, మానవ అనుభవాలు, ఆధ్యాత్మిక అన్వేషణ, సత్యాన్వేషణ వంటి అంశాలు ఆయన రచనల్లో ప్రతిఫలిస్తాయి. ‘ది …’ వంటి రచనలో జ్ఞానం, సృజన, సరస్వతీ తత్వం పట్ల ఆయనకున్న ఆధ్యాత్మిక అనుబంధం వ్యక్తమవుతుంది. తెలుగులోనూ ఆయన రచనలు విశిష్టమైన ముద్రవేశాయి. ‘సుదర్శనం’, ‘విశిష్ట కవితా మార్దవం’, ‘సుదర్శనం కవిత్వావలోకనం’ వంటి రచనలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనాలు.
సుదర్శన్రావు రచనల్లోని చిన్న వాక్యాల్లో కూడా పెద్ద భావాన్ని నిక్షిప్తం చేసే శైలి కనిపిస్తుంది. మనిషి బాహ్య ప్రపంచాన్ని మాత్రమే కాకుండా, అతని అంతరంగాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. సమాజంలోని నటన, మనిషి ఆశలు, మరణం, అమరత్వం, జీవితం వంటి అంశాలను ఆయన తనదైన తాత్విక దృష్టితో పరిశీలించారు. ఆయన రచనల్లో ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న వెనుక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వెనుక మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది. అందుకే ఆయన కవిత్వాన్ని కేవలం పదాల అందంగా కాకుండా, ఆలోచనల సౌందర్యంగా కూడా చూడాలి. ఆయన సాహిత్య సేవలో అత్యంత విశిష్టమైన అధ్యాయం ఆయన ఉర్దూ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించిన కృషి. ముఖ్యంగా కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ ఉర్దూ కవితలను ఆయన తెలుగులోకి అనువదించారు.
కాలమా, కడతేర్చరాదే,
కాని కాలం రాకముందే,
బతుకు బరువైపోకముందే…
ఈ పంక్తుల్లో కాలంతో మనిషి చేసే సంభాషణ, జీవితం భారంగా మారకముందే ఒక ముగింపును కోరుకునే అంతరంగపు వేదన, కాలంజీవితంమరణం మధ్య ఉన్న తాత్విక సంబంధం ప్రతిధ్వనిస్తుంది. సూఫీ కవి సయ్యద్ అహ్మద్ హుసేన్ ‘అమ్జద్’ కవితలను కూడా ఆయన తెలుగులోకి అనువదించారు. ఉర్దూ మహాకవి అసదుల్లా ఖాన్ గాలిబ్ కవితలను తెలుగు పాఠకులకు చేరువ చేయడానికి కృషి చేశారు. సూఫీ తత్వంలోని ఆధ్యాత్మిక అన్వేషణ, గాలిబ్ కవిత్వంలోని తాత్వికత, ఉర్దూ కవిత్వంలోని భావగాఢత ఇవన్నీ తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ద్వారా ఆయన భాషల మధ్య సాహిత్య వారధిగా నిలిచారు. తెలంగాణ సంస్కృతిలో తెలుగు, ఉర్దూ భాషలు పరస్పరం మిళితమై ఉన్న నేపథ్యంలో ఆయన అనువాద కృషి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సుదర్శన్రావు శతజయంతి సందర్భంగా ఆయన రచనలను మరోసారి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆయన అనువదించిన ఉర్దూ కవితలను కూడా ప్రత్యేకంగా సంకలనం చేయాలి. ప్రత్యేకించి కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ ఉర్దూ కవితలకు దేవులపల్లి సుదర్శన్రావు చేసిన తెలుగు అనువాదాలను వెలికితీసి ప్రచురిస్తే, తెలుగుఉర్దూ సాహిత్య సంబంధాలపై పరిశోధనకు విలువైన ఆధారంగా నిలుస్తుంది.
కాలం ఒక రచయిత పేరును కొంతకాలం మరుగునపరచవచ్చు. కానీ విలువైన సాహిత్యాన్ని శాశ్వతంగా చెరిపివేయలేదు. ఆయన అక్షరాలను మళ్లీ వెలుగులోకి తీసుకురావడం. దేవులపల్లి సుదర్శన్రావు రచనలు మళ్లీ చదివే అవకాశం రావాలి. ఆయన అనువాదాలు మళ్లీ వినిపించాలి. ఆయన సాహిత్య ప్రయాణం కొత్త తరానికి పరిచయం కావాలి. ఆయన పేరు తెలంగాణ సాహిత్య చరిత్రలో తన సముచిత స్థానాన్ని మళ్లీ పొందాలి. ఏప్రిల్ 9, 2005న దేవులపల్లి సుదర్శన్రావు పరమపదించారు. ఆయన శతజయంతి సందర్భంగా ఆ మహనీయ సాహితీవేత్తకు ఇదే అక్షర నివాళి.
(వ్యాస్యకర్త: కార్యదర్శి, తెలంగాణ మీడియా అకాడమీ)
నాగులపల్లి
వెంకటేశ్వరరావు
9963576665