సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో శిథిల భవనాలు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల నియంత్రణ చర్యల విషయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రై కార్పొరేషన్లలో భాగంగా ఎంఎంసీ, సీఎంసీ పరిధిలో గడిచిన కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఆక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుండగా, జీహెచ్ఎంసీలో మాత్రం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒకవైపుప అక్రమ నిర్మాణాలపై ప్రజావాణి, ఆన్లైన్ మార్గాల్లో పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలు
గతంలో అక్రమ నిర్మాణాల ప్రమాదాలు జరిగిన సందర్భంలో కోర్టుకు సమర్పించిన నివేదికల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 30 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 40 వేలకు చేరినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి అంజయ్యనగర్ లో ఇటీవల ఐదంగుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన ఘటనతో పకనే ఉన్న సైబరాబాద్, మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టగా, జీహెచ్ ఎంసీ యంత్రాంగం మాత్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇతర కార్పొరేషన్లు క్రమం తప్పకుండా చర్యలు చేపడుతుంటే, సర్ విధుల పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని పలు అసోసియేషన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిథిల భవనాలపై నిర్లక్ష్యమే
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 377 ప్రమాదకర భవనాలు ఉన్నాయి. ఇందులో రాజేంద్రనగర్ అత్యధికంగా 117, శంషాబాద్‌లో 75, సికింద్రాబాద్‌లో 70, చార్మినార్‌లో 56, గోల్కొండలో 47, ఖైరతాబాద్‌లో 12 గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యపు దోరణిలో ఉన్నారు. ప్రమాదక భవనాలను గుర్తించి పోలీసుల సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే వంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.