Cloudbursts | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. హిల్ స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand)లోనూ వర్షబీభత్సం సృష్టించింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ (Cloudbursts) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో కలిసి 13 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.
ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే తొమ్మిది మరణాలు నమోదయ్యాయి. తెహ్రీలో ముగ్గురు, హరిద్వార్, రూర్కీల్లో ఇద్దరు చొప్పున, చమోలీ, డెహ్రాడూన్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తెహ్రీ జిల్లాలోని ఘన్సాలీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఓ ఇల్లు కూలిపోవడంతో ఇకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మరణాలు నమోదయ్యాయి. మండిలో ఇద్దరు, రాంపూర్‌లో ఇద్దరు మరణించారు. రెండు జిల్లాల్లో కలిసి సుమారు 44 మంది గల్లంతయ్యారు. అందులో సిమ్లా జిల్లాలో 36, మండిలో ఎనిమిది మంది మిస్సైనట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Himachal Pradesh: The water level in Beas River has increased due to heavy rains in the region; latest aerial visuals from the region pic.twitter.com/FI26AQIope
— ANI (@ANI) August 1, 2024
ఈ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు, బ్రిడ్జిలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
#WATCH | River Beas flows furiously in Himachal Pradesh’s Kullu as the state continues to receive heavy rainfall pic.twitter.com/g4h3I18i4Y
— ANI (@ANI) August 1, 2024
ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని కూడా భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఏకధాటిగా కుండపోత వర్షం పడింది. ఈ కుంభవృష్టికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లోకి మోకాళ్ల లోతు మేర నీరు చేరింది. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షానికి ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక భారీ వర్షం కారణంగా ఆప్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
Also Read..
Delhi Rain | ఢిల్లీలో 24 గంటల్లో 108 మి.మీటర్ల వర్షం.. 1961 తర్వాత ఇదే తొలిసారి