కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఓదెల/: నేను దుక్కిటెద్దును.. కరెంట్ షాక్కు బలైన రైతు నేస్తాన్ని.. నాలాంటి పరిస్థితి మరో జీవికి రావొద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్న.. నాది, నా యజమాని ఓదెల మండలం అబ్బిడిపల్లికి చెందిన మల్లవేణి సదయ్యది విడదీయలేని బంధం. ఎన్నో ఏండ్ల సంది ఆయన ఇంట్ల మనిషి లెక్క ఉంటున్న. నా యజమాని కూడా నన్ను అట్లనే చూసుకున్నడు. అలపటి ఎద్దుగా అందరికీ చెప్పుకొన్నడు. నేను కూడా నా యజమానికి అన్ని విధాలా అండగా నిలిచిన. దుక్కిదున్ని, దౌరదోలి, గుంటుక కొట్టి, పంటను ఇల్లు చేర్చే వరకూ ఎవుసం పనుల్లో అన్ని విధాలా సాయమందించిన.
ఆయన కుటుంబంలో.. ప్రగతిలో ఓ భాగమైన. సదయ్య నాపై ఎంతో ప్రేమ చూపిండు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘నేనున్నా’ననే భరోసా పెట్టుకున్నడు. అందుకే పొలం పనులకు ఏ రంది లేకుండా ఉన్నడు. నేను కూడా అంతే నమ్మకమిచ్చిన. ఇలా నాకు, నా యజమానికి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. సాఫీగా సాగుతున్న ఈ ప్రయాణంలో నా జీవితం అర్ధాంతరంగా ముగిసింది. అనుకోని రీతిలో నా యజమానికి దూరమైన. కరెంటు షాక్తో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయిన. సోమవారం తెల్లవారుతుండగానే నా యజమాని వద్దకు రవీందర్ అనే తోటి రైతు వచ్చిండు.
ఈ రోజు పొలం దున్నేందుకు మీ ఎడ్లను ఇవ్వాలని అడిగిండు. అందుకు నా యజమాని సరేనని అన్నడు. మమ్మల్ని ఆయనతో కలిసి పంపిండు. మేం యాజమాని చెప్పిన ప్రకారమే నడిచినం. రవీందర్తో కలిసి పొలం దున్నే పనుల్లో నిమగ్నమైన. ఆయన నాగలి పట్టి దున్నుతుంటే.. హుషారుగా ముందుకు నడిచిన. గంటలు గడిచినయి. తర్వాత గొర్రు (జంబు) కొడుతున్న సమయంలో పొలం పక్కనే ఉన్న విద్యుత్ వైరు తగిలింది. అదే నా పాలిట శాపంగా మారింది. కరెంటు షాక్తో విలవిల్లాడిన. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన. రైతు రవీందర్ వెంటనే తేరుకుని పొలం నుంచి బయటకు పరుగుతీసి ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేసిండు. కానీ, నేను ప్రాణాలు నిలుపుకోలేకపోయిన. చివరకు నన్నే సర్వస్వంగా నమ్ముకున్న నా యజమానిని విడిచి వెళ్లిపోవడం నాకు చాలా బాధగా ఉన్నది.
నన్ను చేరదీసి, ఆదరించి ఇంటి మనిషిలెక్క చూసుకున్న నా యజమానికి న్యాయం చేయలేకపోయానన్న ఆవేదన నన్ను వేధిస్తున్నది. నేను మూగజీవినే కావచ్చు! కానీ, నాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా! ఈలోకాన్ని వదిలి వెళ్తున్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినయి. ఇక్కడ నాదొక్కటే ప్రశ్న. నేను చేయని తప్పుకు నన్ను బలి చేయడం ఎంతవరకు న్యాయం? అసలు నా చావుకు బాధ్యులెవరు? విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నాలాగే ఎన్నో మూగజీవాలు బలి కావాల్సిందేనా..? ఇకనైనా కండ్లు తెరవండి. మరే ప్రాణి చనిపోకుండా రక్షణ చర్యలు తీసుకోండి. నా చావు మిమ్మిల్ని ఆలోచింపజేస్తుందని అనుకుంటున్న. అదే జరిగితే.. కనీసం నా తోటి మూగ జీవాలు మృత్యువాత పడకుండా ఉంటయి. తద్వారా నా ఆత్మ సంతృప్తి చెందుతుంది. చివరగా ఒక్క మాట.. ఇన్నాళ్లూ నన్ను చూసుకున్న నా యజమానిని.. నాతో కలిసి పనిచేసిన నా తోటి దాపటి ఎద్దును విడిచిపోవడం నన్ను ఎంతగానో బాధపెడుతున్నది.